న్యూఢిల్లీ, మార్చి 15: ఔషధాలను డెలివరీ చేస్తున్న ఆన్లైన్ ఫార్మసీల(ఈ-ఫార్మసీ) మూసివేత దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నది. డాటా దుర్వినియోగం ఆరోపణలపై ఈ సంస్థలపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని టైమ్స్‌నౌ తన కథనంలో పేర్కొన్నది. ఇటీవల డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా దేశంలోని 20 ప్రముఖ ఈ-ఫార్మసీలకు షోకాజ్ నోటీసులు జారీచేసింది. టాటా 1ఎంజీ, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మెడిబడ్డి, ప్రాక్టో, నెట్‌మెడ్స్, ఫ్రాన్క్రోస్, అపోలో వంటి సంస్థలకు నోటీసులు వెళ్లాయి. లైసెన్సు లేకుండా ఆన్లైన్, ఇంటర్నెట్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో ఔషధాలను విక్రయించడం, ప్రదర్శించడం, సరఫరా చేయడం ఔషధాల నాణ్యతపై ప్రభావం చూపవచ్చని, ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లవచ్చని ఈ నోటీసుల్లో డీజీసీఐ పేర్కొంది. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా ఔషధాలను రిటైల్‌గా అమ్మవద్దని ఉన్న మార్గదర్శకాలను ఈ-ఫార్మసీలు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ ఆండ్ డ్రగ్గిస్ట్స్ కూడా ఈ-ఫార్మసీలపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది.