న్యూఢిల్లీ: ఈ ఏడాది కొనుగోలు చేసిన 1.2 లక్షల టన్నుల వేసవి ఉల్లిగడ్డల్లో దాదాపు 30% కుళ్లిపోవడం, మొలకెత్తడం వల్ల నాశనమయ్యాయి. ఉల్లి కొరతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం బఫర్ స్టాక్ నుంచి 500 టన్నుల ఉల్లిగడ్డలతో ‘కందా ఎక్స్‌ప్రెస్’ అనే ప్రత్యేక రైలు బుధవారం మధ్యాహ్నం 3:30 గంటలకు లాసల్గావ్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. నాఫెడ్ సీనియర్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. ‘పరిస్థితి దిగజారడానికి ప్రధాన కారణం పంట కోత సమయంలో కురిసిన అకాల వర్షాలు. దీనివల్ల ఉల్లి నాణ్యత దెబ్బతిని, నిల్వ ఉండే కాలం తగ్గిపోయింది.
సాధారణంగా ప్రతి ఏటా 20% ఉల్లిగడ్డలు పాడవుతాయి. కానీ ఈ ఏడాది ఆ సంఖ్య 40%కి చేరే అవకాశం ఉన్నది’. చాలా నగరాల్లో ఉల్లి రిటైల్ ధరలు కిలో రూ. 50 నుంచి 65 వరకు చేరడంతో కేంద్ర ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకుని ఈ రైలు సర్వీస్‌ను ప్రారంభించింది. ఢిల్లీలోని నాఫెడ్, ఎన్సీసీఎఫ్, కేంద్రీయ భండార్ అవుట్లెట్ల ద్వారా కందా ఎక్స్‌ప్రెస్ ఉల్లిగడ్డలను కేజీ రూ. 35 రాయితీ ధరకే విక్రయిస్తామని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
బఫర్ స్టాక్‌పై తీవ్ర ఒత్తిడి రైతుల వద్ద ఉల్లి నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయి. సేకరించిన పంటలో 30% కుళ్లిపోవడం వల్ల సరఫరా పరిస్థితి సంక్లిష్టంగా మారిందని నాఫెడ్ అధికారి ఒకరు తెలిపారు. కొత్త పంట వచ్చేలోపే ఉన్న నిల్వలు అయిపోవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. విత్తనాలు వేసే సమయంలో వర్షాలు లేకపోవడంతో ఖరీఫ్ ఉల్లి కోత ఆలస్యమవుతున్నది. నాశిక్‌లో 370 హెక్టార్లలో మాత్రమే నాట్లు పడ్డాయి. డిసెంబర్ నాటికి సాధారణ సరఫరా మొదలవుతుంది. అందుబల్ల అక్టోబర్‌లో తీవ్ర కొరత ఏర్పడవచ్చని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.