శ్రీనగర్: జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన కోసం వేదికపై ప్రత్యేకంగా పెద్ద కుర్చీ ఏర్పాటు చేశారు. అయితే ఆ కుర్చీలో కూర్చునేందుకు ఒమర్ అబ్దుల్లా నిరాకరించారు. వేదికపై ఆశీనులైన వారికి కేటాయించిన మాదిరి కుర్చీలోనే ఆయన కూర్చున్నారు. బుధవారం జమ్ములోని చాతాలో షేర్-ఇ-కశ్మీర్ యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ ప్రధాన క్యాంపస్‌ను ఒమర్ అబ్దుల్లా సందర్శించారు. నాలుగు రోజులు జరిగే ‘నేషనల్ అగ్రికల్చర్ సమ్మిట్, కిసాన్ మేళా’ను ఆయన ప్రారంభించారు.
కాగా, ఆ కార్యక్రమం వేదికపైకి ఎక్కగానే అక్కడ ఒమర్ అబ్దుల్లా కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పెద్ద కుర్చీని ఆయన గమనించారు. దీంతో ఆ పెద్ద కుర్చీని తీసివేయాలని నిర్వాహకులను కోరారు. వేదికపై ఆశీనులైన వారు కూర్చొన్న కుర్చీలాంటిది ఏర్పాటు చేయాలని చెప్పారు. నిర్వాహకులు అలాంటి కుర్చీ ఏర్పాటు చేయడంతో దానిపై కూర్చొన్నారు. దీంతో సీఎం ఒమర్ అబ్దుల్లా తీరును సభికులు చప్పట్లతో అభినందించారు.
మరోవైపు, అక్టోబరు 16న జమ్ముకశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా పదవీ బాధ్యతలు చేపట్టారు. నాటి నుంచి వీఐపీ ఆడంబరాలకు ఆయన దూరంగా ఉన్నారు. తన కాన్వాయ్ ప్రయాణం కోసం ‘గ్రీన్ కారిడార్’ ఏర్పాటు చేయవద్దని, ప్రజలను ఇబ్బందులకు గురిచేయవద్దని పోలీసులకు సూచించారు.