న్యూఢిల్లీ: ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ వెయ్యి మందికి పైగా ఉద్యోగులను, ఒప్పంద కార్మికులను తొలగించనున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్న ఈ కంపెనీ కొనుగోళ్లు, కస్టమర్ రిలేషన్స్ సహా పలు విభాగాల్లో ఉద్యోగులను ఇంటికి పంపించనున్నట్టు సమాచారం.
నిరుడి డిసెంబర్ త్రైమాసికంలో తమకు రూ.564 కోట్లు నష్టాలు వచ్చాయని చెప్పిన ఈ కంపెనీ.. నిరుడు నవంబర్లో 500 మంది ఉద్యోగులను తొలగించింది. తాజాగా తొలగించనున్న ఉద్యోగులు కంపెనీ మొత్తం సిబ్బందిలో పావు శాతం ఉంటారని అంచనా. ఫ్రంట్ ఎండ్ ఆపరేషన్లను ఆటోమేటెడ్ చేసి, ఖర్చులను తగ్గించుకొని, వినియోగదారులకు ఉత్తమ సేవలు అందించడానికి కంపెనీని పునర్ నిర్మిస్తున్నామని ఓలా అధికార ప్రతినిధి తెలిపారు.