చండీగఢ్, మార్చి 21: మంత్రి వేధింపులు భరించ లేక పంజాబ్‌లో ఉన్నతాధికారి ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు! మంత్రి వేధింపులే తన ఆత్మహత్యకు కారణమంటూ ఆయన రికార్డు చేసిన వీడియో రాష్ట్రంలో సంచలనం సృష్టించడంతో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ స్పందించారు. సదరు మంత్రి లాల్జిత్ సింగ్ భుల్లార్‌ను పదవి నుంచి బర్తరఫ్ చేశారు. వైరల్ వీడియోలోని వివరాల ప్రకారం& అమృత్‌సర్‌లో జిల్లా మేనేజర్‌గా ఉన్న గగన్‌దీప్ సింగ్ రంధావా విషం తీసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీంతో అతడిని దవాఖానలో చేర్చగా, చికిత్స పొందుతూ చనిపోయాడు. ఆత్మహత్యకు ముందు ఆయన రికార్డు చేసిన వీడియో వైరల్ అయ్యింది.
మంత్రి భుల్లార్ తనపై ఒత్తిడి తెచ్చి, వేధించి, హింసించాడని ఆయన అందులో ఆరోపించారు. దీనిపై రాజకీయంగా విమర్శలు చెలరేగడంతో.. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఒక అధికారి ఆత్మహత్య చేసుకోవడం ఎంతమాత్రం సహించరానిదని ముఖ్యమంత్రి మాన్ పేర్కొన్నారు. వెంటనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రిని పదవి నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు. జైలు, రవాణా శాఖలు నిర్వహిస్తున్న భుల్లార్ ఒక టెండర్ విషయమై రంధావాపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడని విపక్షాలు ఆరోపించాయి. మంత్రి రాజీనామా ఒక్కటే సరిపోదని, ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అమృత్సర్ ఎంపీ గుర్జిత్ సింగ్ డిమాండ్ చేశారు. దీనిపై స్వతంత్రంగా దర్యాప్తు జరపాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.