Vigilance Raids | ఒడిశాలోని నబరాంగ్పూర్ జిల్లా అదనపు సబ్-కలెక్టర్ ఆయన. ఆయన పేరు ప్రశాంత్ కుమార్ రౌత్. తన ఆదాయానికి మించి భారీగా ఆస్తులు ఉన్నాయని ఆరోపణలతో ఇబ్బందుల్లో పడ్డారు. ఒడిశా విజిలెన్స్ అధికారులు శుక్రవారం ఉదయం అకస్మాత్‌గా ప్రశాంత్ కుమార్ రౌత్ ఇంటిపై దాడి చేశారు. ఆ అధికారులు వస్తున్న సమాచారం తెలుసుకున్న ప్రశాంత్ కుమార్ రౌత్.. పక్కనే ఉన్న ఇంటి టెర్రస్‌పైకి ఆరు బాక్సుల్లో రూ.2 కోట్లకు పైగా క్యాష్ విసిరేశారు.
ఈ ఘటన భువనేశ్వర్‌లోని కనన్ విహార్ ఏరియాలో చోటు చేసుకున్నది. ఆ క్యాష్ మొత్తం విజిలెన్స్ అధికారులు జప్తు చేశారు. తాము వస్తుండగానే పొరుగింటి టెర్రస్ మీదకు నగదు బాక్సులు విసిరేశాడని విజిలెన్స్ అధికార వర్గాలు తెలిపాయి.
అంతే కాదు.. ఒకేసారి తొమ్మిది కేంద్రాల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. భువనేశ్వర్‌లోని కనన్ విహార్-హెచ్ఐజీ 115, నబరంగ్‌పూర్ లోని అధికార చాంబర్, భద్రక్ జిల్లాలోని రౌత్ సొంతిల్లుతోపాటు ఐదు ఇతర ప్రాంతాల్లో తనిఖీలు జరిపామని విజిలెన్స్ అధికారులు తెలిపారు.