Nurul Islam : పశ్చిమబెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, లోక్సభ సభ్యుడు హాజీ షేక్ నూరుల్ ఇస్లాం కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 61 సంవత్సరాలు. కొంతకాలంగా కాలేయ క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన.. కొద్దిసేపటి కిందటే తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. నూరుల్ ఇస్లాం మృతిపట్ల తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
ఆయన మృతికి తీవ్ర సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పార్టీలో సీనియర్ నాయకుడిని, ప్రత్యేకించి ఓ మంచి మిత్రుడిని కోల్పోయామని పేర్కొన్నారు. నూరుల్ ఇస్లాం బసీర్హాట్ లోక్సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆ నియోజకవర్గాన్ని తృణమూల్ కాంగ్రెస్కు పెట్టని కోటగా మార్చారు. గతంలో కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉండేది.
నూరుల్ ఇస్లాం 2009 ఎన్నికల్లో బసీర్హాట్ నుంచి తొలిసారిగా లోక్సభకు ఎన్నికయ్యారు. 2014, 2019లో తృణమూల్ అభ్యర్థులు ఇద్రిస్ అలీ, నుస్రత్ జహాన్ ఇక్కడి నుంచి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో జంగీపూర్ నుంచి లోక్సభకు పోటీచేసి ఓడిపోయారు. 2016లో హరోవా అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. 2021 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో హార్వార్ నుంచి విజయం సాధించారు.
మొన్నటి ఎన్నికల్లో ఆయనను మళ్లీ లోక్సభ ఎన్నికల బరిలో నిలిపారు మమతా బెనర్జీ. 3.30 లక్షలకుపైగా ఓట్ల భారీ మెజారిటీతో విజయఢంకా మోగించారు నూరుల్. భారతీయ జనతా పార్టీకి చెందిన రేఖా పాత్రాను ఆయన ఓడించారు. కాగా నూరుల్ ఇస్లాం మృతిపట్ల మమతా బెనర్జి సహా ఆమె మంత్రివర్గ సహచరులు, తోటి ఎంపీలు, ఎమ్మెల్యేలు సంతాపం తెలిపారు. ఆయన మృతితో బసీర్హట్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.