న్యూఢిల్లీ, నవంబర్ 18: దేశవ్యాప్తంగా శనివారం తలపెట్టిన బ్యాంకు సమ్మెను విరమిస్తున్నట్టు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) శుక్రవారం ప్రకటించింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ).. తమ డిమాండ్లలో చాలావరకు పరిష్కరించేందుకు అంగీకరించడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలిపింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు యథావిధిగా కార్యకలాపాలను కొనసాగించనున్నాయి. ఎలాంటి అంతరాయం లేకుండా లావాదేవీలు జరుగనున్నాయి. ‘అన్ని సమస్యలపై అవగాహన కుదిరింది. సమస్యను ద్వైపాక్షికంగా పరిష్కరించేందుకు ఐబీఏ, బ్యాంకులు అంగీకరించాయి. అందువల్ల మా సమ్మెను విరమిస్తున్నాం’ అని ఏఐబీఈఏ జనరల్ సెక్రెటరీ సీహెచ్ వెంకటాచలం పేర్కొన్నారు.