Notice to MInister | రాజస్థాన్ కాంగ్రెస్‌లో నేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మరోసారి బయటపడింది. పీడబ్ల్యూడీ మంత్రి, ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం చర్చనీయాంశంగా తయారైంది. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంలోని మంత్రి భజన్‌లాల్ జాతవ్, ఎమ్మెల్యే జోగిందర్ సింగ్ అవానా ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుని కాంగ్రెస్ పరువును బజారుకీడ్చారు. ఈ ఇద్దరు కాంగ్రెస్ నేతల మధ్య చాలా కాలంగా ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్నా.. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మాత్రం మౌనం వహించారు.
మంత్రి, ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధానికి సంబంధించిన మొత్తం వ్యవహారం రోడ్డు నిర్మాణ నాణ్యతకు సంబంధించినది కావడం విశేషం. రోడ్ల నిర్మాణంలో మంత్రి భజన్‌లాల్ జాతవ్‌పై నాద్‌బాయి ఎమ్మెల్యే జోగిందర్ సింగ్ అవానా తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. ఇదే సమయంలో అసెంబ్లీలో తాను అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేదని స్పీకర్‌కు అవానా ఫిర్యాదు చేశారు. దాంతో సదరు మంత్రివర్యులు 7 రోజుల్లోగా సమాధానం చెప్పాలని రాజస్థాన్ అసెంబ్లీ నోటీసు ఇచ్చింది.
నద్‌బాయి నుంచి హలైనా, నద్‌బాయి నుంచి నగర్ తోపాటు అసెంబ్లీ నియోజకవర్గంలోని ఇతర రహదారులకు సంబంధించి నక్షత్రం గుర్తున్న ప్రశ్నను ఎమ్మెల్యే అవానా అడిగారు. రహదారులను పరిశీలించగా అన్ని నాణ్యమైనవిగానే ఉన్నాయని తేలిందని మంత్రి భజన్‌లాల్ జాతవ్ వెల్లడించారు. దాంతో తప్పుడు సమాధానం చెప్పారంటూ ఆయన అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.