Uttarakhand | డెహ్రాడూన్, సెప్టెంబర్ 9: ఉత్తరాఖండ్‌లోని కొన్ని గ్రామాల ప్రవేశ మార్గాల వద్ద ఏర్పాటైన బోర్డులు మత వివాదాన్ని రేపాయి. ‘హిందూయేతరులు, రొహింగ్యా ముస్లింలు, వీధి వ్యాపారులు గ్రామంలో తిరుగుతూ వ్యాపారం చేయడం నిషేధం. ఎవరైనా అలా తిరుగుతూ కనిపిస్తే కఠిన చర్యలు తీసుకోబడతాయి’ అని హిందీలో రాసిన బోర్డుల్లో పేర్కొన్నారు. గ్రామసభ ఆదేశాల మేరకు ఈ బోర్డులు ఏర్పాటైనట్టు వాటిలో తెలిపారు. రుద్రప్రయాగ్ జిల్లాలో పలుచోట్ల వెలిసిన ఈ బోర్డులపై రాష్ట్ర డీజీపీ అభినవ్ కుమార్ స్పందిస్తూ స్థానిక పోలీసులు, దర్యాప్తు యూనిట్‌ను ఈ విషయమై దర్యాప్తు చేయాలని ఆదేశించామన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలని గ్రామ్ ప్రధాన్లకు(గ్రామాల అధిపతులు) సమన్లు జారీ చేశామని తెలిపారు.
వచ్చే నెల నుంచి రైతులకు ఆధార్ తరహా ఐడీలు
న్యూఢిల్లీ: ఆధార్ తరహాలో దేశంలోని రైతులందరికీ ఒక ప్రత్యేక ఐడీని జారీచేసేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది. వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్ చేసేందుకు ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేపట్టనున్నట్టు వ్యవసాయ శాఖ కార్యదర్శి దేవేశ్ చతుర్వేది సోమవారం తెలిపారు. అక్టోబర్ మొదటి వారంలో నమోదును ప్రారంభిస్తామని చెప్పారు. ఇటీవల కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన రూ.2,817 కోట్ల డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కార్యక్రమంలో భాగంగా వచ్చే ఏడాది మార్చి నాటికి ఐదు కోట్ల మంది రైతులకు ఈ ఐడీలు జారీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించామని తెలిపారు. ఈ ఐడీ ద్వారా రైతులకు వివిధ వ్యవసాయ పథకాలు, కిసాన్ క్రెడిట్ కార్డు వంటివి సులభంగా అందుతాయని చెప్పారు.