పాట్నా: అక్రమ మద్యం వ్యాపారంతోపాటు జూదం వ్యవహారంతో సంబంధం ఉన్న జేడీయూ నేతతో సహా 14 మందిని బీహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. (JDU Leader Arrest) దీంతో సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వం, ఆయన పార్టీపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆ నేతను పార్టీ నుంచి జేడీయూ బహిష్కరించింది. బీహార్‌లో మద్యాన్ని నిషేధించారు. అయితే నలంద జిల్లాలో మద్యం అక్రమ వ్యాపారంతోపాటు జూదం జోరుగా సాగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి అంబర్ ప్రాంతంలో రైడ్ చేశారు. జేడీయూ నేత సీతారాం ప్రసాద్‌తో సహా 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 292 లీటర్ల విదేశీ మద్యం, 10 డెక్ కార్డులు, 9 ద్విచక్ర వాహనాలు, 14 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
కాగా, ఈ సంఘటనపై బీహార్‌లోని ప్రతిపక్ష పార్టీలు మండిపడ్డాయి. ప్రభుత్వ రక్షణలో ‘లిక్కర్ మాఫియా’ కొనసాగుతున్నదని ఆర్జేడీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో జేడీయూ స్పందించింది. అస్తవాన్ బ్లాక్ జేడీయూ అధ్యక్షుడు సీతారాం ప్రసాద్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది. అన్ని పార్టీ పదవుల నుంచి ఆయనను తొలగించినట్లు జేడీయూ ప్రకటించింది.
మరోవైపు ఈ అరెస్టులు బీహార్ ప్రభుత్వం విశ్వసనీయతను తెలియజేస్తోందని ఆ రాష్ట్ర మంత్రి, జేడీయూ నలంద జిల్లా ఇన్చార్జి విజయ్ చౌదరి తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సొంత పార్టీ వారు కూడా చట్టపరంగా చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు.