శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 12, 2020 , 21:43:04

సీఎం ఎవరన్నది ఎన్డీయే నిర్ణయిస్తుంది: నితీశ్‌

సీఎం ఎవరన్నది ఎన్డీయే నిర్ణయిస్తుంది: నితీశ్‌

పాట్నా: బీహార్‌ కాబోయే ముఖ్యమంత్రి ఎవరన్నది ఎన్డీయే నిర్ణయిస్తుందని జేడీయూ చీఫ్‌, సీఎం నితీశ్‌ కుమార్‌ తెలిపారు. ప్రజలు ఎన్డీయేకు తీర్పు ఇచ్చారని, దీంతో తమ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఎన్డీయేలోని నాలుగు పార్టీల సభ్యులు శుక్రవారం సమావేశమవుతారని అన్నారు. సీఎం ప్రమాణ స్వీకారం దీపావళి లేదా చాత్ తర్వాతా అన్నది ఇంకా నిర్ణయించలేదని నితీశ్‌ తెలిపారు. సీఎం ఎవరు అని మీడియా ప్రశ్నించగా.. పదవిని తాను కోరడం లేదని, ఎన్డీయే నిర్ణయిస్తుందని చెప్పారు. ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన లోక్‌ జనశక్తి పార్టీ చీఫ్‌ చిరాగ్‌ పాశ్వాన్‌పై ఏ చర్య తీసుకోవాలన్న నిర్ణయాన్ని కూడా బీజేపీకే వదిలేసినట్లు నితీశ్‌ కుమార్‌ తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన పార్టీ నేతలతో గురువారం ఆయన సమావేశమయ్యారు. ఫలితాల తీరుపై వారితో సమీక్షించారు.

2015 ఎన్నికల్లో 71 స్థానాలు గెలిచిన జేడీయూ ఈసారి 43 స్థానాలకు పరిమితమైంది. దీంతో మూడు సార్లు సీఎం పదవిని చేపట్టిన నితీశ్‌ కుమార్‌ ఈసారి బీజేపీపై ఆధారపడాల్సి వచ్చింది. అయితే ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు కట్టుబడతామని, సీఎం నితీశ్‌ కుమారే అని బీజేపీ నేతలు పునరుద్ఘాటించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.