Tejashwi Yadav : బీహార్ ముఖ్యమంత్రి (Bihar CM) నితీష్ కుమార్ (Nitish Kumar) హైజాక్ అయ్యారని ఆర్జేడీ (RJD) కీలక నేత తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల సన్నాహకాల కోసం ఢిల్లీలో కాంగ్రెస్ (Congress) అధి నాయకత్వంతో జరిగిన సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీహార్‌లో ప్రతిపక్ష కూటమి పటిష్టంగా ఉన్నదని, బీహార్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నదని చెప్పారు.
బీహార్‌లోని ప్రతిపక్ష కూటమి పార్టీలు ఈ నెల 17న మరోసారి సమావేశమవుతాయని, పట్నాలో ఈ సమావేశం జరుగుతుందని తేజస్వి యాదవ్ తెలిపారు. నితీష్ కుమార్ 20 ఏళ్ల పాలనలో బీహార్ రాష్ట్రం పేద రాష్ట్రంగా మిగిలిపోయిందని విమర్శించారు. తలసరి ఆదాయం, రైతుల రాబడి తగ్గిపోయాయని, వలసలు పెరిగిపోయాయని ఆయన ఆరోపించారు.
ఇవాళ్టి సమావేశంలో సానుకూల చర్చలు జరిగాయని తేజస్వి చెప్పారు. ప్రజా సమస్యలను బేస్ చేసుకునే తాము ఎన్నికల్లో తలపడుతామని అన్నారు. ప్రభుత్వ లోపాలను ప్రజలకు అర్థమయ్యేలా ఎత్తిచూపడం ప్రతిపక్షాల బాధ్యత అని తెలిపారు. ప్రతిపక్ష కూటమి తరఫున సీఎం అభ్యర్థి ఎవరనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. అందరం ఏకగ్రీవంగా సీఎం అభ్యర్థిని ఎన్నుకుంటామని చెప్పారు.
అదేవిధంగా ఈ ఎన్నికల్లో ఎన్డీఏ ఎట్టి పరిస్థితుల్లో గెలువబోదని, తేజస్వి జోస్యం చెప్పారు. వచ్చే బీహార్ ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా ఎన్డీఏ కూటమిని ఓడిస్తామని కాంగ్రెస్ పార్టీ బీహార్ అధ్యక్షుడు రాజేష్ కుమార్ అన్నారు.