నాగ్‌పూర్, ఆగస్టు 25 : కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారన్న ప్రచారం ఆ పార్టీ వర్గాల్లో విస్తృతంగా సాగుతున్నది. తన రాజకీయ రిటైర్మెంట్పై గడ్కరీ నాగ్‌పూర్‌లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో సూచనప్రాయంగా వెల్లడించారు. తాను ఇకపై గతంలోలా పనిచేయలేనని, తన బాధ్యతలు కొత్త తరానికి అప్పగించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.
అయితే ఆయన ఈ ప్రకటన చేసిన కొద్దిసేపటికే యూటర్న్ తీసుకున్నారు. తన వ్యాఖ్యలు ఏ రాజకీయ సందర్భంలోనూ చేయలేదని.. ఆయన కార్యాలయ వర్గాలు గడ్కరీ ప్రకటన ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నం చేశాయి. ఆయన తాను స్థాపించిన లక్ష్మణ్‌రావు మంకర్ ట్రస్ట్ గురించి మాట్లాడారని పేర్కొంది. ఆయన ట్రస్ట్ పనివిధానం, భవిష్యత్ నాయకత్వం గురించి మాట్లాడారని, అయితే టీవీ చానల్స్ మంత్రి చేసిన వ్యాఖ్యలను రాజకీయాలతో ముడిపెట్టి ప్రసారం చేశాయని వారు నొక్కి చెప్పారు.
‘ప్రస్తుతం నేను ఎక్కువ పని చేయలేక పోతున్నా. వీలైనప్పుడు బాగా చేశాను. ఇప్పుడు నా ప్రమేయం తగ్గింది. పనిని కొత్త తరానికి తప్పక అప్పగించాల్సిందే. కొత్త తరం రావాలి. పాత తరం వారిని మార్గదర్శకం చేయాలి’ అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా రోజువారీ పనిలో తన ప్రమేయం తగ్గుతున్న విషయాన్ని ఆయన వివరించారు. ’గత 30 ఏండ్ల నుంచి అవిచ్ఛిన్నంగా ప్రజా సేవలో గడిపా. ఎన్నో ఎత్తుపల్లాలు చూశా. ఎన్నో అవార్డులు అందుకున్నా. ఇప్పుడు నేను ఎక్కువగా పనిచేయలేను. కొత్త తరానికి తప్పక అవకాశం ఇవ్వాలి’ అని 69 ఏండ్ల గడ్కరీ పేర్కొన్నారు. అయితే బీజేపీలో వయసు నిబంధన తీసుకొచ్చిన తర్వాత మొదటిసారి గడ్కరీ ఇలా మాట్లాడటంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.