తిరువనంతపురం: కేరళలో నిపా వైరస్ (Nipah Virus) కేసు వెలుగులోకి వచ్చింది. ఒక మహిళకు ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఆమె చికిత్స పొందుతున్నదని ఆ రాష్ట్ర ఆరోగ్య అధికారులు తెలిపారు. మలప్పురం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. వాలంచెరికి చెందిన ఒక మహిళకు నిపా వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఈ విషయం తెలిపారు. పెరింతలమన్నలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.
కాగా, ఆ మహిళ గత వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నదని ఆరోగ్య అధికారులు తెలిపారు. దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించాయని చెప్పారు. నిపా ఇన్ఫెక్షన్గా అనుమానించి నమూనాలను సేకరించినట్లు తెలిపారు. పూణేలోని వైరాలజీ ప్రయోగశాలకు పంపినట్లు వివరించారు. దీంతో నిపా ఇన్ఫెక్షన్ కేసుగా నిర్ధారణ అయ్యిందని ఆరోగ్య అధికారులు వెల్లడించారు.