హైదరాబాద్, జూన్ 22: కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయంప్రతిపత్తి కలిగిన ఎన్ఐఈఎల్ఐటీ హైదరాబాద్..క్వాంటం కంప్యూటింగ్ అభివృద్ధి చెందుతున్న రంగంలో పరిశోధన, ఆవిష్కరణ-నైపుణ్యాభావృద్దిని ప్రోత్సహించడానికి క్యూక్లైర్వోయెన్స్ క్వాంటమ్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఎన్ఐఈఎల్ఐటీ హైదరాబాద్ ఇంచార్జీ డైరెక్టర్ డా.లక్ష్మణ్ కొర్ర, క్యూక్లైర్వోయెన్స్ క్వాంటమ్ ల్యాబ్స్ డైరెక్టర్ రిటైర్డ్ కల్నల్ సాయి శంకర్ ఈరోజు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు.
ఈ ఒప్పందంలో భాగంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు, పరిశోధకులు, విద్యావేత్తలు, పరిశ్రమ నిపుణుల కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లు, అధ్యాపకుల అభివృద్ధి కార్యక్రమాలు, ఇంటర్న్‌షిప్‌లు, పరిశోధన-ఆధారిత కార్యకలాపాలు నిర్వహించనున్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న క్వాంటం టెక్నాలజీ రంగంలో సామర్థ్య నిర్మాణం, ఆవిష్కరణల కోసం ఒక బలమైన వేదికను సృష్టించడమే ఈ ఒప్పందం లక్ష్యం. ఐఐటీ నిపుణులు, శాస్త్రవేత్తలు, పరిశ్రమ నిపుణులచే శిక్షణ కార్యక్రమాలను అందించడంతోపాటు క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం అల్గారిథమ్‌లు, క్వాంటం కమ్యూనికేషన్, క్వాంటం క్రిప్టోగ్రఫీ, సంబంధిత సాంకేతికతలోని అత్యాధునిక పరిణామాలపై చర్చించనున్నారు.