న్యూఢిల్లీ: దేశంలోని అనేక నగరాల్లో ఉగ్రవాద దాడులకు పాల్పడేందుకు ఉగ్రవాద డాక్టర్ల మాడ్యూల్ కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైంది. విశ్వసనీయ వర్గాల ప్రకారం, ఈ వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్‌కు పాకిస్థాన్‌లోని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయి.
ఎర్రకోట పేలుడు నిందితుడైన డాక్టర్ ముజమిల్ షకీల్‌ను ప్రశ్నించినపుడు, అనేక ప్రాంతాల్లో పేలుళ్లు జరిపేందుకు తాము 2023 నుంచి ప్రయత్నిస్తున్నట్లు చెప్పాడు. యూరియా, అమోనియం నైట్రేట్, పేలుడు పదార్థాలు, రిమోట్లు, బాంబు తయారీకి అవసరమైన ఇతర వస్తువులను ఈ రెండేళ్లలో కొన్నామని తెలిపాడు.