లక్నో: ఏడు రోజుల నవజాత శిశువు పట్ల తల్లిదండ్రులు అమానుషంగా ప్రవర్తించారు. ఒక వంతెన పైనుంచి కిందకు విసిరేశారు. (Newborn Thrown Off Bridge) అయితే చెట్టు కొమ్మలో ఇరుక్కుని తీవ్రంగా గాయపడిన ఆ శిశువును కొందరు కాపాడారు. పక్షులు పొడవడంతోపాటు 50కు పైగా గాయాలతో ఆసుపత్రితో చేరిన ఆ పసి బాలుడు బతకడం కష్టమని డాక్టర్లు భావించారు. కృష్ణ అని పేరు పెట్టిన ఆ పసి బాలుడు కోలువడంతో డాక్టర్లు, సిబ్బంది వీడలేక ఉద్వేగానికి గురయ్యారు. ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆగస్ట్ 26న ఏడు రోజుల కిందట పుట్టిన నవజాత శిశువును కన్నవాళ్లు ఒక వంతెన పైనుంచి పడేశారు. అయితే అదృష్టవశాత్తు చెట్టు కొమ్మలపై పడిన పసి బాబు అక్కడ చిక్కుకున్నాడు.
కాగా, పసి బాలుడి ఏడ్పు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ చిన్నారిని రక్షించారు. తొలుత హమీర్పూర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం కాన్పూర్లోని లాలా లజపతిరాయ్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. కాకులు పొడిచి, కీటకాలు కుట్టడంతో పాటు 50కు పైగా గాయాలున్న ఆ పసి బాబు బతకడం చాలా కష్టమని డాక్టర్లు భావించారు.
మరోవైపు ఆసుపత్రి సిబ్బంది చాలా శ్రద్ధగా చికిత్స అందించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు చెట్టుపై లభించిన ఆ పసికందుకు కృష్ణ అని పేరు పెట్టారు. రెండు నెలలపాటు కంటికి రెప్పలా కాపాడారు. గాయాల నొప్పితో ఆ బాబు ఏడ్చినప్పుడు నర్సులు లాలిపాటలు పాడారు. చివరకు పసి బాలుడు కోలుకోవడంతో అక్టోబర్ 24న పోలీసులు, శిశు సంక్షేమ కమిటీ సభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా డాక్టర్లు, నర్సులు, సిబ్బంది ఎంతో ఉద్వేగానికి గురయ్యారు. రెండు నెలలపాటు ఎంతో అనుబంధం పెంచుకున్న ఆ బాల కృష్ణుడ్ని విడువలేక కొంతమంది కన్నీరు కార్చారు. ఆ బాలుడి జీవితం బాగుండాలని వారు ఆకాంక్షించారు.