న్యూఢిల్లీ : కేంద్ర పారిశ్రామిక భద్రత దళం (సీఐఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్‌గా రజ్విందర్ సింగ్ భట్టి, సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) చీఫ్‌గా దల్జీత్ సింగ్ చౌదరి నియమితులయ్యారు. సిబ్బంది వ్యవహారాల శాఖ బుధవారం ఈ మేరకు ఆదేశాలను జారీ చేసింది. భట్టి 1990 బ్యాచ్ బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి. ఆయన వచ్చే ఏడాది సెప్టెంబరు 30 వరకు పదవిలో కొనసాగుతారు. చౌదరి 1990 బ్యాచ్ యూపీ క్యాడర్ ఐపీఎస్ అధికారి. ఆయన వచ్చే ఏడాది నవంబరు 30 వరకు బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా కొనసాగుతారు.
ముంబై (నమస్తే తెలంగాణ): ఒకసారి ప్రొబేషనర్‌గా ఎంపికై, నియమించిన తర్వాత తన అభ్యర్థిత్వాన్ని తొలగించే అధికారం యూపీఎస్సీకి లేదని మాజీ ఐఏఎస్ ట్రైనీ అధికారిణి పూజా ఖేద్కర్ వాదించారు. తనపై ఢిల్లీ హైకోర్టులో యూపీఎస్సీ దాఖలు చేసిన కేసుపై ఆమె ఈ విధంగా స్పందించారు. ‘అఖిల భారత సర్వీసుల చట్టం-1954, సీఎస్ఈ 2022 నిబంధనల్లోని ప్రొబేషనర్ రూల్స్ నెం.19 ప్రకారం డీఓపీటీ(వ్యక్తిగత, శిక్షణ విభాగం) మాత్రమే చర్యలు తీసుకోవచ్చు’ అని ఆమె తెలిపారు. యూపీఎస్సీకి తన పేరును తప్పుగా లేదా మోసం చేసే విధంగా చెప్పలేదని ఆమె పేర్కొన్నారు.