షిల్లాంగ్, జూన్ 13: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన వ్యాపారి రాజా రఘువంశీ హత్య కేసు దర్యాప్తులో మరో కొత్త కోణం బయటపడింది. మరో గుర్తు తెలియని మహిళను హత్య చేసి, ఆమె శవాన్ని తగలబెట్టి, అది కనిపించకుండా పోయిన రఘువంశీ భార్య సోనమ్ మృతదేహంగా నమ్మించేందుకు హంతకులు కుట్ర పన్నారని మేఘాలయ పోలీసులు వెల్లడించారు. అలా చేయడం ద్వారా సోనమ్ అజ్ఞాతంలోనే కొంతకాలం ఉండాలన్నది వారి పథకమని పోలీసులు చెప్పారు. ఈ మొత్తం కుట్ర వెనుక సోనమ్ ప్రియుడు రాజ్ కుష్వాహా ప్రధాన కుట్రదారుడని, అతనికి సహకరించిన సోనమ్ సహ కుట్రదారుగా పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. రఘువంశీ హత్యకు ఇండోర్‌లో ఫిబ్రవరిలో పథక రచన జరిగింది. రఘువంశీని హత్య చేసిన తర్వాత సోనమ్ ఎలా అదృశ్యం కావాలో పరిపరి విధాలుగా హంతకులు ఆలోచించారు.
సోనమ్ నదిలో కొట్టుకుపోయిందని నమ్మించాలని ఓ పథకం వేశారు. ఎవరో ఓ అపరిచిత మహిళను హత్య చేసి, శవాన్ని తగలబెట్టి అది సోనమ్ శవమని నమించాలని మరో పథకం వేశారు. అయితే ఈ రెండు పథకాలలో ఏవీ ఫలించలేదని పోలీసులు తెలిపారు. మే 19న కొత్తగా పెళ్లయిన సోనమ్, రాజా రఘువంశీ జంట అస్సాంకు రావడానికి చాలా రోజుల ముందే హంతకుల ముఠా గువాహటి చేరుకుంది. తాము అనుకున్న పథకాలు ఏవో కారణాలతో కార్యరూపం దాల్చకపోవడంతో షిల్లాంగ్, సోహ్రా వెళ్లాలని సోనమ్ అప్పటి కప్పుడు ఆలోచన చేసింది. అనుకున్న విధంగానే వీరంతా నాన్గ్రియాత్ వద్ద కలుసుకున్నారు. వీసాడాంగ్ వాటర్ ఫాల్స్ వద్దకు విడివిడిగా అంతా కలిసే బయల్దేరారు. హంతకులు ముగ్గురూ అస్సాంలో కొన్న కొడవలితో సోనమ్ సమక్షంలోనే మే 23వ తేదీ మధ్యాహ్నం 2-2.18 గంటల మధ్య రఘువంశీని నరికి చంపారు. ఆ తర్వాత రాజా మృతదేహాన్ని లోయలో పడేశారు.
ఆకాశ్ షర్టుకు రక్తపు మరకలు అంటుకోవడంతో వాటిని దాచేందుకు సోనమ్ తాను ధరించిన రెయిన్ కోటు అతనికి ఇచ్చింది. అంతేగాక తాము అద్దెకు తీసుకున్న ద్విచక్ర వాహనాన్ని కూడా సోనమ్ అక్కడే వదిలేసింది. సోనమ్ కనిపించకుండా పోయిందని అందరూ భావిస్తున్న సమయంలో ఆ ప్రదేశంలో లభించిన రెయిన్‌కోట్, టూవీలర్‌ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాల్‌కు రాజా బురఖా ఇచ్చాడని, దాన్ని రాజ్ సోనమ్‌కు అందచేశాడని పోలీసులు చెప్పారు. బురఖా ధరించి సోనమ్ పోలీసు బజార్‌కు వెళ్లి అక్కడి నుంచి గువాహటికి ట్యాక్సీలో వెళ్లిందని వారు చెప్పారు. గువాహటి నుంచి బస్సులో పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురికి చేరుకున్న సోనమ్ పాట్నా, ఆరాకు బస్సులలో వెళ్లినట్లు వారు చెప్పారు. రైలులో లక్నో చేరుకున్న సోనమ్ అక్కడి నుంచి ఇండోర్‌కు బస్సులో వెళ్లినట్లు వారు తెలిపారు. ఈ మధ్యలో, ఓ టూర్ గైడ్‌ని మేఘాలయ మీడియా ఇంటర్వ్యూ చేయగా సోనమ్, రాజా, మరో ముగ్గురు వ్యక్తులను తాను చూసినట్లు తెలిపాడు.
రాజా హత్య తర్వాత ఇండోర్‌లో సోనమ్‌ను కలుసుకున్న రాజ్ అక్కడి నుంచి సిలిగురి లేదా మరో ప్రదేశానికి వెళ్లి తనను ఎవరో కిడ్నాప్ చేసినట్లు నాటకమాడమని సోనమ్‌కు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. జూన్ 8న సోనమ్ ఇండోర్ నుంచి బయల్దేరగా మేఘాలయ నుంచి రెండు పోలీసు బృందాలు ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్‌కు సివిల్ డ్రెస్‌లో చేరుకున్నాయి. యూపీలో ఆకాశ్‌ను పోలీసులు అరెస్టు చేయగా వెంటనే సోనమ్‌కు ఫోన్ చేసిన రాజ్ తాను కిడ్నాపింగ్ గ్యాంగ్ నుంచి తప్పించుకుని వచ్చినట్లు నాటకమాడమని సోనమ్‌కు చెప్పాడు. ఆ ప్రకారమే సోనమ్ ఘాజీపూర్‌లో బయటకు వచ్చింది. మారుమూల ప్రదేశంలో రాజాను హత్య చేసి పడేసినందున శవం దొరకడానికి కనీసం రెండు, మూడు నెలలు పడుతుందని హంతకులు భావించారని, అందుకే సోనమ్ చేత బాధితురాలిగా నాటకం ఆడించారని పోలీసులు చెప్పారు. ప్రస్తుతం నిందితుల వాంగ్మూలాలు నమోదు చేస్తున్నామని, వారిని ప్రశ్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. మరిన్ని సాక్ష్యాధారాలను సేకరించి క్రైమ్ సీన్‌ను రికన్‌స్ట్రక్ట్ చేస్తామని వారు చెప్పారు. కాగా రఘువంశీని చంపేందుకు హంతకులు మూడు విఫల ప్రయత్నాలు చేశారని, నాలుగో ప్రయత్నంలో అతడిని హత్య చేశారని పోలీసులు తెలిపారు.