China | న్యూఢిల్లీ, డిసెంబర్ 31: ఒకవైపు భారత్‌తో సరిహద్దు చర్చలు కొనసాగిస్తూనే మరోవైపు తన అసలు స్వభావాన్ని చైనా చాటుకున్నది. అక్కడి జింజియాంగ్‌లో రెండు కొత్త కౌంటీలను ఏర్పాటు చేసింది. హియాన్ కౌంటీ, హెకాంగ్ కౌంటీ పేర్లతో ఈ కొత్త కౌంటీలను కలిపి జింజియాంగ్ యూగర్ అటానమస్ రీజియన్ ఏర్పాటు చేసింది. ఇందుకు చైనా కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ, రాష్ట్ర కౌన్సిల్ సైతం ఆమోదం తెలిపింది.
హియాన్ కౌంటీకి హాంగ్లియూ, హెకాంగ్ కౌంటీకి జెయిడులా టౌన్‌షిప్‌లు పరిపాలనా కేంద్రాలుగా ఉంటాయని ప్రకటించింది. హియాన్ కౌంటీలో అక్సాయ్ చిన్ను భాగంగా పేర్కొన్నది. అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని భారత్ నుంచి చైనా ఆక్రమించిన సంగతి తెలిసిందే. కాగా, చైనా చర్యపై భారత్ స్పందించాల్సి ఉంది. గత నెలలోనే సరిహద్దు వివాదాల పరిష్కారానికి చైనా, భారత్ మధ్య 23వ దశ చర్చలు జరిగాయి. భారత్ తరపున జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి బీజింగ్‌లో కలిసి చర్చించారు. సరిహద్దు చర్చలు కొనసాగుతుండగానే చైనా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.