NEET UG 2027 : ఈ ఏడాది జరిగిన నీట్ యూజీ పరీక్ష ఎంతటి వివాదం సృష్టించిందో తెలిసిందే. పరీక్షా పత్రం లీక్ కావడం, దీంతో పరీక్ష రద్దు కావడం, మళ్లీ నిర్వహించడం, విద్యార్థుల ఆత్మహత్యలు, ఆందోళనలు, రాజకీయ విమర్శలు.. ఇలా నీట్ పరీక్ష చుట్టూ బోలెడు వివాదాలు నడిచాయి. కానీ, మొత్తానికి నీట్ రీ ఎగ్జామ్ జరిగింది. ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరగబోయే నీట్ యూజీ 2027కు సంబంధించి కీలక మార్పులు జరగబోతున్నాయి. ఈ మేరకు నీట్ పరీక్ష నిర్వహించే ‘ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే)’ కొన్ని మార్పులు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది జరిగినట్లు లీకేజీలు జరగకుండా, విమర్శలకు తావులేకుండా ఈ పరీక్ష నిర్వహించాలని ఎన్టీయే లక్ష్యంగా పెట్టుకుంది. కొన్ని నివేదికల సమాచారం ప్రకారం.. వచ్చే ఏడాది పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)గా జరగనుంది. అంటే పూర్తిగా కంప్యూటర్‌పైనే పరీక్ష నిర్వహిస్తారు. ఇలా నీట్ పరీక్ష నిర్వహించనుండటం ఇదే మొదటిసారి. అలాగే, ఇప్పట్లోలాగే ఒకేరోజు పరీక్ష కాకుండా కనీసం ఐదు లేదా ఆరు రోజులపాటు పరీక్ష జరుగుతుంది. ఇటీవలి పరీక్షకు దాదాపు 23 లక్షల మంది హాజరయ్యారు. అందువల్ల ఐదు రోజులపాటు పరీక్ష నిర్వహిస్తే.. రోజుకు ఐదు లక్షల మంది వరకు హాజరవుతారు. పరీక్షా కేంద్రాలను కూడా తగ్గిస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5,000 కేంద్రాలలో పరీక్ష జరుగుతుంది. అయితే, ఇకపై 500 పట్టణాల్లో, 1,000 కేంద్రాలలో మాత్రమే పరీక్ష నిర్వహించాలని ఎన్టీయే భావిస్తోంది. అవి కూడా ఎక్కువ ప్రభుత్వ విద్యా సంస్తల్లోనే ఎగ్జామ్ నిర్వహించాలనే ఆలోచన చేస్తోంది.
ఇందుకోసం ప్రభుత్వ విద్యాసంస్తలైన కేంద్రీయ విద్యాలయాలు, నవదోయ విద్యాలయాలు వంటి వాటిని వినియోగించుకుంటుంది. ప్రైవేటు సంస్థలకు తక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు అన్నింటిపై చర్చ జరుగుతోంది. వీటికి ప్రభుత్వ ఆమోదం లభిస్తే.. ఈ విధానంపై తుది నోటిఫికేషన్ వెలువడుతుంది. అంతేకాదు.. ఎన్టీయేలో వ్యవస్థాపక మార్పులకు కూడా సంస్థ సిద్ధమైంది. ఎన్టీయేలోకి 150 మంది సిబ్బందిని కూడా నియమించుకోబోతుంది. ఈ ఏడాది అక్టోబర్‌లోపు నియామకపు ప్రక్రియ పూర్తికానుంది.