కోటా: రాజస్థాన్‌లోని కోటాలో నీట్-యూజీ కోసం శిక్షణ పొందుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. సర్కిల్ ఇన్స్పెక్టర్ అరవింద్ భరద్వాజ్ తెలిపిన వివరాల ప్రకారం, ఆమె కుటుంబం మధ్య ప్రదేశ్‌లోని షియోపూర్ నుంచి చాలా కాలం క్రితం కోటాకు వచ్చింది. నీట్-యూజీ పరీక్షకు ఆదివారం హాజరుకావలసి ఉండగా, శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో తన గదిలో ఐరన్ గ్రిల్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలో ఆమె కుటుంబ సభ్యులు కూడా ఇంట్లోనే ఉన్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. మృతదేహం వద్ద సూసైడ్ నోట్ లేదు. కోటాలో ఈ ఏడాది జనవరి నుంచి వెలుగులోకి వచ్చిన ఆత్మహత్య కేసుల్లో ఇది 14వది. నిరుడు 17 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
జన్యు మార్పిడి వరి వంగడాల ఆవిష్కరణ ; అభివృద్ధి చేసిన ఐకార్ శాస్త్రవేత్తలు
ఢిల్లీ, మే 4: జన్యు మార్పిడి (జీనోమ్ ఎడిటింగ్) ద్వారా అభివృద్ధి చేసిన రెండు రకాల వరి వంగడాలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఆదివారం విడుదల చేశారు. ఈ రకం వంగడాలను మన దేశంలో ఆవిష్కరించడం ఇదే మొదటిసారి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్ (ఐకార్) అభివృద్ధి చేసిన ఈ రెండు వరి వంగడాలకు పూసా డీఎస్టీ రైస్ 1, డీఆర్ఆర్ ధన్ 100 (కమల) అని పేరు పెట్టారు. ఇవి ప్రతికూల వాతావరణాన్ని, కరువు పరిస్థితులను తట్టుకుంటాయి. అంతేకాదు, తక్కువ నీటిని వినియోగించి, ఎక్కువ దిగుబడి ఇవ్వడం వీటి ప్రత్యేకత. హైదరాబాద్‌లోని ఐకార్- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రిసెర్చ్ శాస్త్రవేత్తలు సాంబా మసూరి (బీపీటీ 5204) రకం నుంచి జన్యు మార్పిడి ద్వారా కమల రకాన్ని అభివృద్ధి చేశారు. ఎంటీయూ 1010 రకం నుంచి పూసా డీఎస్టీ రైస్ 1ను ఢిల్లీలోని ఐకార్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.