NEET – Priyanka Gandhi | దేశవ్యాప్తంగా వైద్య కాలేజీల్లో ఎంబీబీఎస్ తదితర యూజీ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే ‘నీట్-2024’ పరీక్షలో అవకతవకలపై దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాధ్రా డిమాండ్ చేశారు. ‘నీట్-2024’లో అవకతవకలపై విద్యార్థులు ఫిర్యాదు చేస్తున్నారని గుర్తు చేశారు. ఈ మేరకు ఆమె ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’ వేదికగా పోస్ట్ పెట్టారు.
‘నీట్ పరీక్షా పత్రం లీక్ అయింది. నీట్ ఫలితాల్లోనూ కుంభకోణం జరిగిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఒకే పరీక్షా కేంద్రంలో పరీక్ష రాసిన ఆరుగురు విద్యార్థులకు 720 మార్కులకు 720 మార్కలు రావడంపై తీవ్రమైన సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ పరీక్ష నిర్వహణలో జరిగిన పలు రకాల అవకతవకలు వెలుగు చూడాల్సి ఉంది. మరోవైపు నీట్ ఫలితాలు వెల్లడించగానే దేశవ్యాప్తంగా పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు వార్తలొచ్చాయి. ఇది చాలా విచారకరం, దిగ్భ్రాంతికరం’ అని రాసుకొచ్చారు.
‘లక్షల మంది విద్యార్థుల వాణిని ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నది? నీట్ పరీక్షా ఫలితాల్లో అవకతవకలపై విద్యార్థులు లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానాలు రావాలి. విద్యార్థుల ఫిర్యాదులపై దర్యాప్తు చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా?’ అని ప్రియాంక నిలదీశారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం నీట్ పరీక్షల్లో అవకతవకలకు కేంద్ర ప్రభుత్వానిదే ప్రత్యక్ష బాధ్యత అని స్పష్టం చేశారు. ‘నీట్‌తో సహా దేశంలో జరుగుతున్న పలు పరీక్షల్లో రిగ్గింగ్, పేపర్ లీక్స్, అవినీతి నిత్యకృత్యంగా మారింది. నియామక పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం యువత భవితవ్యంతో ఆటలాడుకుంటున్నది. ప్రతిభావంతులైన విద్యార్థులకు న్యాయం చేకూర్చేందుకు నీట్ పరీక్షలో అవకతవకలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలి’ అని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షలో అవకతవకలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ డిమాండ్ చేశారు.