న్యూఢిల్లీ, జూన్ 25: భారత్లో ఎమర్జెన్సీని విధించిన ఐదు దశాబ్దాలు దాటిన తర్వాత మొట్టమొదటిసారి 9వ తరగతి పాఠ్యపుస్తకంలో పాఠంగా ఈ అంశాన్ని ఎన్సీఈఆర్టీ ప్రవేశపెట్టింది. అత్యవసర పరిస్థితిలో ప్రాథమిక హక్కుల్లో చాలా వరకు రద్దు అయినందున దీనిని ప్రజాస్వామ్యం ప్రధాన సవాళ్లలో ఒకటిగా ఈ పాఠ్యాంశంలో పొందుపరిచింది.
కొత్తగా రూపొందించిన అండర్స్టాండింగ్ సొసైటీ: ఇండియా అండ్ బియాండ్ అనే సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో ఈ ప్రస్తావన కనిపిస్తుంది. ఇందులో భారత ప్రజాస్వామ్య బలాలు, సవాళ్లు అనే అధ్యాయంలో ఎమర్జెన్సీని చేర్చారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎదుర్కొన్న ప్రధాన సవాళ్లలో ఒకటి 1975-77 మధ్య విధించిన అత్యవసర పరిస్థితి’అని ఆ పాఠ్యాంశంలో పేర్కొన్నారు.