Navaneet Rana : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అక్కడి రాజకీయ పరిణామాల్లో మార్పులు మొదలయ్యాయి. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా విలక్షణ నటుడు సయాజీ షిండే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆయన అజిత్ పవార్ వర్గం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరోవైపు లోక్‌సభ మాజీ సభ్యురాలు, బీజేపీ నాయకురాలు నవనీత్ రాణా కీలక వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్రలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన భార్య, మాజీ ఎంపీ నవనీత్ రాణా పోటీ చేయబోదని రవి రాణా చెప్పారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర అసెంబ్లీలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తన భార్య నవనీత్‌కు రాజ్యసభ సీటు కేటాయిస్తామని బీజేపీ హామీ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. బీజేపీ హామీ మేరకే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయవద్దని ఆమె నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
అమరావతి నుంచి 2019లో ఎంపీగా గెలిచిన నవనీత్ రాణా 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి బల్వంత్ వాంఖడే ఆమెపై గెలుపొందారు. 2024లో పార్లమెంట్ ఎన్నికల ముందు ఆమె బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. 2019 సార్వత్రిక ఎన్నికల్లో నవనీత్ రాణా అమరావతి సెగ్మెంట్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు.