న్యూఢిల్లీ: ఉన్నత విద్యా సంస్థలలో వరుసగా జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలపై సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా నివారించడానికి విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి సంబంధించిన ఆందోళలను పరిష్కరించడానికి ఓ జాతీయ టాస్క్ఫోర్సును(ఎన్టీఎఫ్) సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది.ఐఐటీ, ఢిల్లీలో చదువుతూ ఆత్మహత్యకు పాల్పడిన ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఢిల్లీ పోలీసులను ఆదేశించింది.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ ఎన్టీఎఫ్ చైరపర్సన్గా ఉంటారని, రాష్ర్టాల ఉన్నత విద్యా శాఖ, సామాజిక న్యాయ, న్యాయ వ్యవహరాలు, సాధికారత, మహిళా, శిశు అభివృద్ధి శాఖల కార్యదర్శులు ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉంటారని సుప్రీంకోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది. ఆత్మహత్యలకు దారితీస్తున్న కారణాలపై సమగ్ర నివేదికను అందజేయాల్సి ఉంటుందని తెలిపింది.