లక్నో, ఆగస్టు 2: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లోని ఓ గ్రామంలో విద్యార్థులు బడికి పోవాలంటే పెద్ద సాహసమే చేయాల్సి వస్తున్నది. చందౌలీ జిల్లా సదర్ మండలం మసౌనీ గ్రామంలోని పాఠశాలకు చేరుకోవాలంటే రోడ్డే లేదు. పిల్లలంతా బురదమయమైన పొలం గట్లపై నడుచుకుంటూ వెళ్లాలి. తిరిగి వచ్చేటప్పుడూ అదే సీన్. చెప్పులు చేత పట్టుకుని, ఆ బురదలో వెళ్తుంటే చాలాసార్లు కింద పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాళ్లు, చేతులు విరగ్గొట్టుకుని ఇంటికి పోయిన రోజులు కూడా ఉన్నాయని, అయినా తమ సమస్యలను పట్టించుకునే వారే లేరని ఆ స్కూల్ టీచర్ తారా కుమారి తెలిపారు. పాఠశాలలో 250 మందికిపైగా విద్యార్థులు ఉన్నారని చెప్పారు. స్కూల్ చుట్టూ పొలాలు ఉన్నాయని, దారి కోసం భూమి ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావట్లేదని, అందుకే రోడ్డు వేయలేకపోతున్నామని ప్రాంతీయ విద్యాధికారి సురేంద్ర బహదూర్ సింగ్ చెబుతున్నారు.