న్యూఢిల్లీ, జూలై 12: కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనంపై ప్రతిష్టించేందుకు రూపొందించిన జాతీయ చిహ్నం రూపురేఖలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోదీ ఆవిష్కరించిన ఈ చిహ్నం రాజసం ఉట్టిపడేదిగా కాకుండా క్రూరత్వానికి గుర్తుగా ఉన్నదని అంటున్నారు. మన జాతీయ చిహ్నం (నాలుగు సింహాల విగ్రహం) రూపాయి నోట్లు సహా అన్ని ప్రభుత్వ దస్తావేజులపై దర్శనమిస్తుంది.
ఆ చిహ్నంలోని నాలుగు సింహాలను గమనిస్తే ఓవైపు రాజదర్పాన్ని ప్రదర్శిస్తూనే మరోవైపు ఉదారతను చాటుతూ, శాంతికి గుర్తుగా ఉంటాయి. బౌద్ధ మతాన్ని స్వీకరించిన అశోక చక్రవర్తి క్రీస్తుపూర్వం 250వ సంవత్సరంలో సారనాథ్ శిల్పాన్ని నెలకొల్పాడు. ఆ శిల్పంలో నాలుగు సింహాలు ఒకదాని వెనుక ఒకటి వీపులు ఆన్చి గుండ్రంగా నిల్చొని ఉంటాయి. ఆ గద్దెపై ఎద్దు, గుర్రం, ఏనుగు, వాటి మధ్యలో అశోక చక్రాలు ఉంటాయి. కింద సత్యమేవ జయతే అని రాసి ఉంటుంది. ఇదే శిల్పాన్ని స్వాతంత్య్రానంతరం కొన్ని మార్పులతో మనం జాతీయ చిహ్నంగా మార్చుకున్నాం.
ఈ చిహ్నాన్ని గత 75 ఏండ్లలో ఎన్నడూ మార్చలేదు. బౌద్ధంలో సింహం స్థిరచిత్తానికి, బలానికి, వివేకానికి ప్రతీక. కానీ ప్రధాని మోదీ సోమవారం ఆవిష్కరించిన జాతీయ చిహ్నంలోని సింహాలు క్రూరత్వానికి ప్రతీకగా కనిపిస్తున్నాయి. ఆ చిహ్నంలోని సింహాలు భయంకరంగా గర్జిస్తున్నట్టుగా ఉన్నాయి. ఈ సింహాలు ఉగ్రత్వానికి, హింసకూ సంకేతాలుగా ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ క్రమ పద్ధతిలో స్వాతంత్య్ర పోరాట యోధుల త్యాగనిరతిని, దేశ చరిత్రను వక్రీకరిస్తూ వస్తున్న కమలనాథులు ఇప్పుడు చిహ్నాలను కూడా తమ కుటిల నీతికి ప్రతీకగా మారుస్తున్నారన్న వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో వెల్లువెత్తుతున్నాయి.
‘ఇదే మోదీ నయా భారత్’అని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ విమర్శించారు. ‘గంభీరంగా ఉండే సింహాలతో కూడిన మన జాతీయ చిహ్నానికి ఇది అవమానం. మోదీ ఆవిష్కరించిన సింహాలు అసమానంగా ఉంటూ అనవసరంగా ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నాయి. ఇది దేశానికి సిగ్గుచేటు’అంటూ తృణమూల్ ఎంపీ జవహర్ సర్కార్ ట్వీట్ చేశారు. ‘నిజం చెప్పాలంటే.. సత్యమేవ జయతే నుంచి సింఘమేవ జయతే అన్నట్టుగా ఉందీ చిహ్నం’అని తృణమూల్ ఎంపీ మహువా మోయిత్రా ఎద్దేవా చేశారు.
అధికారపక్షం వింత సమర్థన
జాతీయ చిహ్నం విషయంలో మోదీ దుశ్చర్యను అధికార బీజేపీ వింత వాదనలతో సమర్థించుకుంటున్నది. జాతీ య చిహ్నానికి సంబంధించి విమర్శలు ఊహించనివి ఏమీ కాదని, కాళీమాతను అవమానించిన వారి నుంచి ఇంతకు మించి ఏం ఆశిస్తామంటూ కేంద్ర మంత్రి సృ్మతి ఇరానీ వ్యాఖ్యానించారు. ఇక మరో కేంద్రమంత్రి హర్దీప్ పురి మాట్లాడుతూ.. సారానాథ్ స్థూపంలో ఉన్న సింహాలకు, కొత్త పార్లమెంటు భవనంపై పెట్టిన సింహాలకు తేడానే లేదంటూ సమర్థించారు.