న్యూఢిల్లీ, నవంబర్ 21: పాఠశాల పాఠ్యపుస్తకాల్లో మార్పులకు సంబంధించి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) కమిటీ కీలక సూచనలు చేసింది. చరిత్ర పుస్తకాల్లో రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలను చేర్చాలని ప్రతిపాదించింది. రాజ్యాంగ పీఠికను పాఠశాల తరగతి గదుల గోడలపై ఆయా స్థానిక భాషలలో రాయాలని సూచించినట్టు కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ సీ ఐజాక్ జాతీయ మీడియాకు తెలిపారు. సాంఘిక శాస్ర్తానికి సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీ.. వేదాలు, ఆయుర్వేదం వంటి అంశాను పాఠ్యాంశాలుగా పరిచయం చేయాలని పేర్కొంది. ఈ కమిటీ చేసిన సిఫార్సుల ప్రకారం భారత దేశ చరిత్రను నాలుగు భాగాలుగా సంప్రదాయ యుగం, మధ్య యుగం, బ్రిటిష్ శకం, ఆధునిక యుగంగా విభజించాలి.