న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొనేందుకు ఈ నెలాఖరులో చైనాలో పర్యటించనున్నారు. గల్వాన్‌లో 2020లో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు జరిగిన తర్వాత ఆయన చైనాను సందర్శించనుండటం ఇదే తొలిసారి. ఈ నెల 30న జపాన్‌లో పర్యటించిన అనంతరం రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని చైనా వెళ్తారు.
గల్వాన్ ఘర్షణ తర్వాత నాలుగేండ్ల పాటు ఇరు దేశాల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తత నెలకొంది. ఆ తర్వాత నిరుడు అక్టోబర్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశమయ్యాక ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ జరిగింది. నేరుగా విమాన సర్వీసులు, కైలాస్ మానసరోవర్ యాత్రను పునరుద్ధరించేందుకు ఈ సంవత్సరం జూన్‌లో ఇరు దేశాలు అంగీకరించాయి.