ముజఫర్నగర్: కన్వర్ యాత్ర(Kanwar Yatra) చేపట్టే రూట్లో ఉన్న హోటళ్లు, తినబండారాల షాపులకు ఉండే నేమ్ప్లేట్లపై ఓనర్ల పేర్లు, మొబైల్ ఫోన్ నెంబర్లు, అడ్రస్లు రాసి ఉండాలని యూపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ముజాఫర్నగర్లో ఈ రూల్ను కచ్చితంగా పాటిస్తున్నారు. ఆగ్రా నుంచి హరిద్వార్ వెళ్లే రూట్లో హోటళ్లకు ఉండే నేమ్ప్లేట్లను పరిశీలిస్తున్నారు. కన్వర్ యాత్ర చేపట్టే వారి మధ్య కన్ఫ్యూజన్ ఉండరాదు అని, శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ముజాఫర్నగర్ జిల్లా పోలీసు అభిషేక్ సింగ్ తెలిపారు.
నేమ్ప్లేట్ల అంశంపై పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ స్పందించారు. రాజ్యాంగం సమాన హక్కులు కల్పిస్తుందని, ఎవరిపై వివక్ష చూపదన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని, ఒకవేళ బీజేపీ 400 సీట్లు దాటితే, అప్పుడు ఆ పార్టీ రాజ్యాంగాన్ని నాశనం చేస్తుందని రాహుల్ గాంధీ చెప్పిన మాట నిజమే అని ముఫ్తీ పేర్కొన్నారు. ముస్లింలు, దళితుల హక్కులను దెబ్బతీయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు.
#WATCH | Srinagar, J&K: On ‘nameplates’ on food shops on the Kanwar route in Uttar Pradesh, PDP Chief Mehbooba Mufti says, “…Our Constitution gives equal rights, does not want to discriminate against anyone…They (BJP) are violating the Constitution. Rahul Gandhi rightly said… pic.twitter.com/QqORuEuRLl
— ANI (@ANI) July 20, 2024
యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా ఈ అంశంపై రియాక్ట్ అయ్యారు. ప్రతిపక్ష సభ్యులు కన్వర్ యాత్రికులను హరిద్వార్ తీసుకువెళ్లి, శివుడికి పూజలు చేయాలని సూచించారు. దీని వల్ల వాళ్లకు కలిగిన అనుమానాలు నివృత్తి అవుతాయన్నారు. ప్రశ్నలు వేస్తున్నవాళ్లు, కేవలం ముస్లింలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
మర వైపు ఇవాళ ఉదయం ముజాఫర్ నగర్ జిల్లాలోని రత్నపురి పోలీసు స్టేషన్ పరిధిలో ప్రమాదం జరిగింది. సతేరి గ్రామం వద్ద ఓ ట్రక్కు.. కన్వర్ యాత్రికులపై దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో 14 మంది కన్వరీలు గాయపడ్డారు. ట్రక్కు టైరు పేలి, ఆ వాహనం యాత్రికులపైకి దూసుకెళ్లింది.