Nagpur Police : వరుసగా పండుగలు రాబోతున్న వేళ మహారాష్ట్రలోని నాగ్‌పూర్ పట్టణ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పట్టణ పరిధిలో డీజేలు, మోడిఫైడ్ సౌండ్ సిస్టమ్స్, బీమ్ లైట్స్, లేజర్ బీమ్లైట్స్, డీజే వాహనాలపై నిషేధం విధించారు. ఈ నిషేధం నవంబర్ 1 వరకు అమలులో ఉంటుందని నాగ్‌పూర్ సిటీ పోలీస్ కమిషనర్ విశ్వాస్ నాగ్రే పాటిల్ వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఆదేశాలు జారీ చేశారు.
పట్టణ పరిధిలోని ప్రతి ఒక్కరూ ఈ ఆదేశాల్ని పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే, నిబంధనలకు అనుగుణంగా నడిచే సౌండ్ సిస్టమ్స్.. అంటే టాప్, మిడ్, బేస్‌తో కూడిన మల్టీ స్పీకర్ సిస్టమ్స్, ప్లాస్మా సౌండ్ సిస్టమ్స్, ప్రెజరైజ్డ్ సౌండ్ సిస్టమ్స్ వంటి వాటికి ఈ నిషేధం వర్తించదని తెలిపారు. ఈ నిర్ణయంపై నాగ్‌పూర్ పట్టణ డీసీపీ రాహుల్ మదానే మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఈ ఆదేశాలు పాటించాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే, ఈ నిర్ణయాన్ని కొందరు సమర్ధిస్తుంటే.. మరికొందరు విమర్శిస్తున్నారు.
త్వరలో పండుగల సీజన్ ప్రారంభమవ్వబోతుంది. వినాయక చవితి, దసరా నవరాత్రులు వంటివి ఘనంగా జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో సీపీ ఆదేశాలు జారీ చేయడంపై పలు హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. హిందూ పండుగలప్పుడే ఇలాంటి రూల్స్ పెడతారని వీహెచ్‌పీ ఆరోపిస్తోంది. స్థానిక వీహెచ్‌పీ నేత అమోల్ థాక్రే ఈ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఈద్ సందర్భంగా కూడా ఇలాంటి నిషేధమే విధించాలని సీపీకి ఫిర్యాదు చేసినప్పటికీ అప్పుడు పట్టించుకోలేదని, ఇప్పుడు హిందూ పండుగల సందర్భంగా మాత్రం నిషేధం విధిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
హిందూ పండుగలను తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. అంతేకాదు.. కృష్ణ జన్మాష్టమి వేడుకల్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 6న డీజే నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. సీపీ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేశారు. బీజేపీ కూడా పోలీసుల నిర్ణయాన్ని తప్పుబట్టింది. హిందూ పండుగల సమయంలోనే ఇలాంటి నిషేధాజ్ఞలు ఎందుకు అమలు చేస్తున్నారని సెంట్రల్ నాగ్‌పూర్ బీజేపీ ఎమ్మెల్యే ప్రవీణ్ దత్కే ప్రశ్నించారు.
పండుగల సందర్భంగా నిబంధనలకు అనుగుణంగా డీజే నిర్వహిస్తామని ఆయన అన్నారు. తాము పోలీసుల ఆజ్ఞల్ని తప్పుబట్టడం లేదని, అయితే ఈ సమయంలోనే ఆదేశాలు ఇవ్వడంపైనే తమ అభ్యంతరం అని వివరించారు.