Suicide : పశ్చిమబెంగాల్ (West Bengal) రాజధాని కోల్‌కతా (Kolkata) లోని ఆర్జీ కర్ (RG Kar) మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్ (Sanjay Roy) మేనకోడలు (Niece) అనుమానాస్పద స్థితిలో మరణించింది. కప్బోర్డు (Cupboard) లో వేలాడుతూ కనిపించింది. ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
కోల్‌కతాలోని అలీపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోగల విద్యాసాగర్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సంజయ్ రాయ్ అక్క కుమార్తె అయిన 11 ఏళ్ల బాలిక విద్యానగర్ కాలనీలో ఆరో తరగతి చదువుతోంది. కొన్నేళ్ల క్రితం బాలిక తల్లి ఆత్మహత్య చేసుకోవడంతో తండ్రి తన మరదలును రెండో వివాహం చేసుకున్నాడు.
అప్పటి నుంచి బాలికను సవతి తల్లి, తండ్రి వేదింపులకు గురిచేస్తున్నారని పోలీసుల విచారణలో స్థానికులు వెల్లడించారు. ఆదివారం రాత్రి సవతితల్లి పటాసులు కొనుక్కురావడానికి వెళ్లింది. ఆమె తిరిగి వచ్చేసరికి లోపలి నుంచి గడియపెట్టి ఉంది. ఎంతపిలిచినా పలుకకపోవడంతో ఆమె తలుపులు పగులగొట్టుకుని లోపలికి వెళ్లింది.
అంతా వెతికినా బాలిక జాడ కనిపించకపోవడంతో కప్‌బోర్డులు తీసి చూసింది. ఓ కప్‌బోర్డులో బాలిక వేలాడుతూ కనిపించింది. ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరిశీలించి అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు. ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.