చెన్నై: కండిషనల్ బెయిల్పై (Conditional Bail) జైలు నుంచి వచ్చిన ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ ఎదుటే దారుణ హత్యకు గురయ్యాడు. తమిళనాడులోని సేలంలో (Salam) నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తూత్తుకూడికి చెందిన మధన్ అలియాస్ అప్పులు (28) అనే వ్యక్తి ఓ హత్య కేసులో జైలుకు వెళ్లాడు. అయితే నిబంధనలతో కూడిన బైయిల్పై గత మంగళవారం విడుదలయ్యాడు. మరుసటి రోజు ఉదయం 10 గంటలకు అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టేందుకు తన భార్యతో కలిసి హస్తంపట్టి పోలీస్ స్టేషన్కు వెళ్లారు.
అక్కడ పని పూర్తయిన తర్వాత పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఓ హోటల్లోకి వెళ్లి భోజనం చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు అతనిపై పదునైన ఆయుధాలతో దాడిచేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన మధన్ అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ దాడిలో మొత్తం ఆరుగురు పాల్గొన్నట్లు గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నట్లు చెప్పారు.