Asteroid | న్యూయార్క్, ఫిబ్రవరి 19: అంతరిక్షంలో గతితప్పి దూసుకొస్తున్న ‘2024 వైఆర్4’ అనే గ్రహశకలం భూమిని ఢీకొనే అవకాశాలు మరింతగా పెరిగాయి. ఆ ఆస్టరాయిడ్ గమనం ప్రకారం.. భూమిని ఢీకొట్టే అవకాశం 3.1 శాతం పెరిగింది. ఈ ఆస్టరాయిడ్ ఢీకొనే అవకాశమున్న రిస్క్ కారిడార్‌లో తూర్పు పసిఫిక్ మహాసముద్రం, దక్షిణ అమెరికాలోని ఉత్తరభాగం, అట్లాంటిక్ మహాసముద్రం, అరేబియా సముద్రం, దక్షిణాసియా తదితర ప్రాంతాలు ఉన్నాయి. ముంబై, కోల్‌కతా, ఢాకా, బొగొటా, అబిడ్జాన్, లాగోస్, ఖార్టూమ్ లాంటి ఏడు ప్రధాన నగరాలు ఇందులో ఉండటం ఆందోళనకరం. ఈ నగరాల్లో సుమారు 110 మిలియన్ల మంది నివసిస్తున్నారు.
ఇంటర్నేషనల్ ఆస్టరాయిడ్ వార్నింగ్ నెట్వర్క్ నేతృత్వంలో భూమిపై నుంచి టెలిస్కోప్ ద్వారా చేస్తున్న పరిశీలనల ద్వారా ఇది ఏప్రిల్ వరకు కనిపిస్తుంది. ఆ తర్వాత 2028 జూన్ వరకు కనిపించకుండాపోయే అవకాశం ఉంది. ‘ఇది భూమిని ఢీకొట్టే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నప్పటికీ.. 2032 డిసెంబర్ 22 నాటికి మరో 2.3 శాతం పెరిగే అవకాశం ఉంది. గతంలోనూ ఇలాంటి ఎన్నో ఖగోళ వస్తువులు కనిపించాయి. ఆ తర్వాత రిస్క్ లిస్ట్ నుంచి తొలగిపోయాయి’ అని ఫిబ్రవరి 7న తన నివేదికలో నాసా తెలిపింది.
ఈ ఆస్టరాయిడ్‌ను 2024 డిసెంబర్ 24న ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. డిసెంబర్ 31న నాసా రిస్క్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్న తర్వాత దీనిపై ఖగోళ శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. ప్రకాశం (బ్రైట్నెస్) ఆధారంగా దాని పరిమాణం 130-300 అడుగుల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇది భూమిని ఢీకొట్టకపోతే అంతరిక్షంలోనే 8 మెగాటన్నుల టీఎన్టీ శక్తితో పేలిపోయే ఆస్కారముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హిరోషిమాపై ప్రయోగించిన బాంబు కంటే 500 రెట్లు ఎక్కువ శక్తి కలిగిన ఇది అత్యంత బలమైన అంతరిక్ష శిలగా గుర్తింపు పొందింది. 2024 వైఆర్4 గ్రహశకలం సిటీ కిల్లర్‌గా గుర్తింపు పొందింది. భూగ్రహానికి ప్రమాదకారి కానప్పటికీ, ఒక నగరాన్ని తుడిచిపెట్టే సామర్థ్యం దీనికి ఉంది. అయితే, ఈ ఆస్టరాయిడ్ భూమిని ఢీకొట్టేందుకు 2.3 శాతం మాత్రమే అవకాశాలు ఉన్నట్టు గతంలో నాసా అంచనా వేసింది.