న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi)వద్రా ఇవాళ లోక్‌సభలో మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్‌పై చర్చ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ.. పెహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని ఖండించారు. బైసారన్ వ్యాలీలో ఎందుకు భద్రతను ఏర్పాటు చేయలేదని ఆమె ప్రశ్నించారు. సరైన భద్రత లేకపోవడం వల్లే అక్కడ ఉగ్రదాడి జరిగినట్లు ఆమె ఆరోపించారు. దాని వల్లే 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆమె వెల్లడించారు.
ప్రభుత్వంపై బాధ్యతతో టూరిస్టులు బైసారన్ లోయకు వెళ్లారని, కానీ ప్రభుత్వం మాత్రం దేవుడి మీద భరోసా వేసిందన్నారు. 2019లో టీఆర్ఎఫ్ ఉగ్ర సంస్థ ఏర్పడిందని, ఆర్మీ అధికారుల్ని చంపుతూ 25 సార్లు ఉగ్రదాడులకు పాల్పడిందని, కానీ 2023లో ఆ సంస్థను ఉగ్ర సంస్థగా ప్రకటించారన్నారు. బైసారన్‌లో జరిగిన భద్రతా లోపాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైనా తమ పదువులకు రాజీనామా చేశారా అని ప్రియాంకా గాంధీ వద్రా అడిగారు.
నెహ్రూ గురించి బీజేపీ నేతలు ప్రస్తావించడంతో.. ఆమె మాట్లాడుతూ మీరు గతం గురించి చెబుతున్నారని, కానీ తాను మాత్రం ప్రస్తుత పరిస్థితి గురించి మాట్లాడుతున్నట్లు పేర్కొన్నారు. 11 ఏళ్లు అధికారంలో ఉన్నారని, దానికి బాధ్యత తీసుకోవాలన్నారు. ముంబైలో 2008లో జరిగిన సెప్టెంబర్ 26 దాడుల తర్వాత ఆ రాష్ట్ర సీఎం, హోంశాఖ మంత్రి రాజీనామా చేసినట్లు ఆమె గుర్తు చేశారు. పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి ఎందుకు రాజీనామా చేయలేదని ఆమె ప్రశ్నించారు.
పాకిస్థాన్ సరెండర్ అయ్యేందుకు అంగీకరిస్తే, మరి యుద్ధాన్ని ఎందుకు ఆపేశారని ప్రియాంకా అడిగారు. అమెరికా అధ్యక్షుడు ఎందుకు కాల్పుల విరమణ ప్రకటించారని ఆమె ప్రశ్నించారు. ఉగ్రవాద బాధితల బాధను అర్థం చేసుకుంటానని, తనకు వారి బాధ ఏంటో తెలుసు అని, తన తండ్రిని ఉగ్రవాదులు చంపినప్పుడు తన తల్లి ఎలా బాధపడిందో తెలుసు అని ప్రియాంకా అన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం కేవలం క్రెడిట్ ఆశిస్తున్నదని, కానీ బాధ్యతను విస్మరిస్తున్నట్లు చెప్పారు. ఇదేమీ స్వర్ణ కిరీటం కాదు అని, ముళ్ల కిరీటం అని ఆమె పేర్కొన్నారు. పెహల్గామ్ ఉగ్రదాడిలో చనిపోయిన 25 మంది భారతీయ పర్యాటకుల పేర్లను ప్రియాంకా తన ప్రసంగంలో చదివి వినిపించారు.
సభలో ప్రియాంకా గాంధీ మాట్లాడుతున్న సమయంలో.. బీజేపీ ఎంపీలు హిందూ అంటూ నినాదాలు చేశారు. అయితే విపక్ష ఎంపీలు దానికి కౌంటర్‌గా ఇండియన్ అంటూ నినాదాలు చేశారు.
అఖిలేశ్ యాదవ్..
పెహల్గామ్ ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేసిన అంశంపై సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ స్పందించారు. ఉగ్రవాదుల్ని ఇప్పుడు ఎన్కౌంటర్ చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. ఆపరేషన్ మహాదేవ్లో భాగంగా సోమవారం ముగ్గురు ఉగ్రవాదుల్ని హతమార్చిన విషయం తెలిసిందే. బోర్డర్ల వద్ద శాంతి కావాలని, మన భూభాగాన్ని ఎవరూ ఆక్రమించవద్దు అన్నారు. పాకిస్థాన్‌తో యుద్ధం కాదు అని, ఇది చైనాతో యుద్ధం అని, ఆపరేషన్ సిందూర్ వేళ ఎన్ని యుద్ధ విమానాలు కోల్పోయామో చెప్పాలని అఖిలేశ్ యాదవ్ అడిగారు.