బెంగళూరు: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ బహిష్కృత ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను ఎట్టకేలకు సిట్ అరెస్టు చేసింది. శుక్రవారం తెల్లవారుజామున జర్మనీలోని మునిచ్ నుంచి వచ్చిన ప్రజ్వల్‌ను బెంగళూరు విమానాశ్రయంలో దిగగానే సిట్ బృందం అదుపులోకి తీసుకున్నది. వందలాది మంది మహిళలను లైంగికంగా వేధించారని అరోపణలను ఎదుర్కొంటున్న ప్రజ్వల్‌ను మహిళా పోలీసులే అరెస్టు చేయడం విశేషం. మహిళా ఐపీఎస్ అధికారులు సుమన్ డీ పన్నేకర్, సీమా లత్కర్ నేతృత్వంలోని మహిళా పోలీసులతో కూడిన సిట్ బృందం ప్రజ్వల్ విమానం దిగగానే అరెస్టు వారెంట్ చేతికిచ్చి పోలీసు జీపు ఎక్కించారు. పటిష్ఠ భద్రత మధ్య ఆయనను దవాఖానకు తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించి కోర్టులో హాజరుపరచగా ఏడు రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అప్పగించింది. దీంతో పోలీసులు ప్రజ్వల్‌ను సీఐడీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు.
ఇప్పటికి మూడు కేసులు నమోదు
మాజీ ప్రధాని దేవెగౌడ మనవడైన ప్రజ్వల్ రేవణ్ణ హసన్ ఎంపీగా ఉన్నారు. ఈ ఎన్నికల్లోనూ జేడీఎస్ అభ్యర్థిగా బీజేపీ మద్దతుతో పోటీ చేశారు. ఎన్నికల వేళ ప్రజ్వల్‌కు చెందినవిగా భావిస్తున్న అశ్లీల వీడియోలు బయటకు రాగానే ఏప్రిల్ 27న అతడు జర్మనీ పారిపోయాడు. ఇప్పటివరకు ప్రజ్వల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో మూడు కేసులు నమోదయ్యాయి. రేప్ కేసు కూడా నమోదు చేశారు.