భోపాల్: ఒక మహిళతో ఎఫైర్‌ను చూసిన కుమారుడ్ని తండ్రి దారుణంగా హత్య చేశాడు. అతడి చేతులు నరికాడు. ఆపై గొంతునులిమి చంపాడు. చెట్ల పొదల్లో మృతదేహాన్ని పడేశాడు. చివరకు పోలీసుల దర్యాప్తులో ఆ వ్యక్తి దొరికిపోయాడు. మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బరోతా పోలీస్ స్టేషన్ పరిధిలోని బంగార్డ గ్రామానికి చెందిన 45 ఏళ్ల వ్యక్తికి, బంధువైన 35 ఏళ్ల మహిళతో వివాహేతర సంబంధం ఉంది. సోమవారం ఆ మహిళతో అతడు సన్నిహితంగా ఉండటాన్ని 15 ఏళ్ల కుమారుడు చూశాడు.
ఈ విషయాన్ని ఎవరికైనా చెబుతాడేమోనని ఆ వ్యక్తి భయపడ్డాడు. ఈ నేపథ్యంలో కొడుకును హత్య చేశాడు. ఆ వ్యక్తి తొలుత కుమారుడి చేతులు నరికాడు. 400 అడుగుల లోతైన బోరుబావిలో నరికిన చేతులను పడేశాడు. ఆ తర్వాత కుమారుడి గొంతు నొక్కి హత్య చేశాడు. పొలాల సమీపంలోని చెట్ల పొదల్లో మృతదేహాన్ని పడేశాడు.
మరోవైపు మంగళవారం సాయంత్రం బాలుడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో చేతులు తెగి ఉన్న బాలుడి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి పోస్ట్‌మార్టం నిర్వహించారు. గొంతు నొక్కి హత్య చేసినట్లు రిపోర్ట్ వచ్చింది. చివరకు ఆ బాలుడి వివరాలు తెలుసుకున్న పోలీసులు అతడి తండ్రిని ప్రశ్నించారు. కుమారుడు అదృశ్యమైనప్పటికీ పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంపై గట్టిగా అడిగారు.
జరిగిన విషయం చెప్పిన ఆ వ్యక్తి, కుమారుడ్ని తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో హత్యకు వినియోగించిన తాడు, కొడవలితోపాటు నరికిన చేతులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తితోపాటు అతడి ప్రియురాలిని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు.