భువనేశ్వర్: కదులుతున్న బస్సులో మంటలు చెలరేగాయి (moving bus catches fire). అందులోని ప్రయాణికులు వెంటనే బస్సు నుంచి కిందకు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. అనంతరం ఆ బస్సు పూర్తిగా కాలిపోయింది. ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన ఒక బస్సు హైదరాబాద్ నుంచి ఒడిశాలోని సింహపల్లికి వెళ్తున్నది. గురువారం తెల్లవారుజామున కోరాపుట్ జిల్లాలోని బోరిగుమ్మ బస్టాండ్ వద్ద ఆ బస్సు టైర్ పేలింది. దీంతో బస్సుకు మంటలు వ్యాపించాయి.
కాగా, మంటలను గమనించిన ప్రయాణికులు వెంటనే బస్సు నుంచి కిందకు దిగారు. దీంతో అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. అనంతరం కొన్ని నిమిషాల్లో ఆ బస్సు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. కొంత సేపటికి అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. బస్సు ప్రయాణికుల్లో ఎవరికీ ఏమీ జరుగకపోవడంతో అంతా ఊరట చెందారు. మరోవైపు బస్సులో మంటలు చెలరేగడాన్ని గమనించిన స్థానికులు తమ మొబైల్ ఫోన్లతో వీడియో తీశారు. ఈ వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.