Vivek Bindra | వ్యక్తిత్వ వికాస నిపుణుడు, పాపులర్ మోటివేషనల్ స్పీకర్ కం సోషల్ మీడియా ఇన్ఫ్ల్యూయెన్సర్ వివేక్ బింద్రా చిక్కుల్లో పడ్డారు. భార్యపై వివేక్ బింద్రా గృహ హింసకు పాల్పడినట్లు నోయిడా పోలీసులు తెలిపారు. వివేక్ బింద్రా బావ మరిది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు నోయిడా సెక్టార్ 126 పోలీసులు తెలిపారు. నొయిడా సెక్టార్ 94లో వివేక్ బింద్రా, ఆయన సతీమణి యానిక నివసిస్తున్నారని పోలీసులు చెప్పారు.
ఈ నెల ఆరో తేదీన బింద్రా, యానికల వివాహం జరిగింది. పెండ్లయిన కొన్ని గంటల్లోనే యానికను ఓ గదిలోకి తీసుకెళ్లి వివేక్ బింద్రా దుర్భాషలాడినట్లు, చేయి చేసుకున్నట్లు యానిక సోదరుడు వైభవ్ క్వత్రా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. ఈ నెల ఏడో తేదీన బింద్రా తన తల్లి ప్రభతో జరుగుతున్న ఘర్షణలో జోక్యం చేసుకున్నందుకే యానికపై ఆమె భర్త దాడి చేసినట్లు తెలుస్తున్నది.
ఈ దాడిలో ఆమె చెవి వినికిడి కోల్పోయిందని, ఆమె ఫోన్ కూడా వివేక్ బింద్రా లాక్కుని పగులకొట్టాడని వైభవ్ క్వత్రా తన ఫిర్యాదులో తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ఇదిలా ఉంటే వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా వివేక్ బింద్రాకు ఇన్ స్టాగ్రామ్లో లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. ఆయన ఏర్పాటు చేసిన బడా బిజినెస్ ప్రైవేట్ లిమిటెడ్ (బీబీపీఎల్) ఒక కుంభకోణంలో చిక్కుకున్నట్లు తెలుస్తున్నది.