రాయ్‌బరేలి, జూలై 10: దేశంలో సైనికుల నియామకానికి కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నివీర్ పథకాన్ని నిలిపివేయాలని మరణాంతర కీర్తిచక్ర అవార్డు గ్రహీత కెప్టెన్ అన్షుమన్ సింగ్ తల్లి మంజు సింగ్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
‘రెండు చేతులు జోడించి కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నా. దయుంచి అగ్నివీర్‌ను రద్దు చేయండి. కేవలం నాలుగేళ్లకు వారిని నియమించడం సరికాదు. సైనికుడిగా విధులు నిర్వహించిన వ్యక్తికి ఆ తర్వాత కూడా పెన్షన్, క్యాంటిన్ వంటి సౌకర్యాలు కొనసాగాలి’ అని ఆమె అన్నారు. పుణెలోని ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీలో గ్రాడ్యుయేట్ అయిన అన్షుమన్ సింగ్ గత ఏడాది జూలైలో జరిగిన ప్రమాదంలో తన సహచరులను రక్షించే క్రమంలో గాయపడి మరణించారు. మరణాంతరం ప్రకటించిన కీర్తిచక్రను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఏడాది జూలైన 5న ఆయన భార్యకు అందజేశారు.