న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ఉన్న షాహీ ఈద్గాలో కోర్టు పర్యవేక్షణలో సర్వే నిర్వహించేందుకు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను మసీదు కమిటీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. శ్రీకృష్ణ జన్మభూమి దేవాలయం పక్కనే ఈ మసీదు ఉందనే సంగతి తెలిసిందే. ఈ మసీదు గతంలో హిందూ దేవాలయమని, అందుకు సంబంధించిన చిహ్నాలు ఇప్పటికీ ఉన్నాయని హిందూ పక్షం వాదిస్తున్నది.
శ్రీకృష్ణ జన్మభూమి ట్రస్ట్‌కు చెందిన 13.37 ఎకరాల స్థలంలోని కొంత భాగంలో ఈ మసీదును నిర్మించారని వివరించింది. ఈ మసీదులో సర్వే కోసం కోర్టు కమిషనర్‌ను నియమించేందుకు హైకోర్టు గత ఏడాది డిసెంబరు 14న అంగీకరించింది. హైకోర్టు ఆదేశాలను నిలిపేయాలని మసీదు కమిటీ చేసిన విజ్ఞప్తిని గత డిసెంబరు 15న సుప్రీంకోర్టు తిరస్కరించింది. అపీలు చేయవచ్చునని చెప్పింది.