వారణాసి: కాశీ విశ్వనాథ్ కారిడార్‌తో శివ భక్తులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూస్తున్నారు. శ్రావణ మాసం, మహాశివరాత్రి వేళ కాశీలో భారీ సంఖ్యలో జనం ఉంటారు. అయితే ఆ జనసమూహాన్ని అదుపు చేసే రీతిలో సుందరీకరణ చేపట్టారు. మోక్షదాయిని గంగా నదితో నేరుగా భక్తులు కనెక్ట్ చేసేందుకు ఈ ప్రాజెక్టును చేప్టటారు. గంగా నదిలో స్నానం చేసిన శివ భక్తులు ఇప్పుడు నేరుగా ఆలయంలో విశ్వనాథుడిని దర్శనం చేసుకోవచ్చు. కాశీ క్షేత్రంలో జరుగుతున్న పరిణామాలు.. భవిష్యత్తులో ఈ ప్రాంత ప్రాభవ్యాన్ని పెంచనున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని అత్యంత వైభవంగా తీర్చిదిద్దున్నారు. ఇక ఆలయ పనుల గురించే కాశీ వీధుల్లో చర్చలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలోనూ ఇదే చర్చ సాగుతోంది. కాశీలో కొత్తగా ముముక్షు భవన్ నిర్మిస్తున్నారు. మోక్షం కోసం కాశీకి వచ్చే వారు ఆ బిల్డింగ్‌లో ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాశీ విశ్వనాథ్ థామ్ ప్రారంభానికి ముందు ఆలయంపై ఉన్న స్వర్ణ గోపురాలను శుభ్రం చేశారు. ప్రస్తుతం ఆ స్వర్ణ శిఖరాలు తళతళ మెరిసిపోతున్నాయి. కాశీ విశ్వనాథ్ థామ్ నిర్మాణం కోసం ప్రధాని మోదీ.. 2019, మార్చి 8వ తేదీన శంకుస్థాపన చేశారు. ఇక ఇప్పుడు విశ్వనాథుడి ఆలయం ఎంత పెద్దగా మారిదంటే, అక్కడ సుమారు రెండు లక్షల మంది భక్తులు నిలబడి, శివుడిని పూజించే అవకాశం ఉంటుంది. 1835లో కాశీ విశ్వనాథుడి ఆలయంపైన స్వర్ణ తాపడాలను మహారాజ్ రంజిత్ సింగ్ ఏర్పాటు చేశారు. బాబా ధామ్ వద్ద మ్యూజియంను కూడా నిర్మించారు. ఆలయ ప్రాశస్త్యాన్ని వివరించే రీతిలో మ్యూజియంను ఏర్పాటు చేశారు.