2025 నుంచి నిలిపివేస్తాం
ప్రఖ్యాత ఇంజినీరింగ్ అకాడమీ ఐఎన్ఏఈకి కేంద్రప్రభుత్వం లేఖ
తప్పుబట్టిన ఇంజినీరింగ్ మేధావులు
‘అయితే అమ్మకం లేకుంటే నిర్వీర్యం’
విధానాన్ని మార్చుకోవాలని హితవు
న్యూఢిల్లీ, జూలై 7: కీలకమైన ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసిన బీజేపీ సర్కారు.. ప్రభుత్వ అనుబంధ సంస్థలను కూడా నిర్వీర్యం చేయడమే పనిగా పెట్టుకున్నట్టు కనిపిస్తున్నది. ఇంజినీరింగ్ రంగంలో దేశానికి దిక్సూచిలా వ్యవహరించే, ఈ రంగానికి సంబంధించి ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాల్లో పాలుపంచుకునే ‘ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజినీరింగ్ (ఐఎన్ఏఈ)’కి నిధులు నిలిపివేయనున్నట్టు ప్రకటించింది. 31 మార్చి 2025 నుంచి నిధులను నిలిపివేస్తామని పేర్కొంటూ కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ ఐఎన్ఏఈకు లేఖ రాసింది. మే నెలలోనే మౌఖికంగా సమాచారమిచ్చిన కేంద్రం.. తాజాగా అధికారికంగా లేఖ రాయడంతో ఇంజినీరింగ్ మేధావులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఓ వైపు ఇంజినీరింగ్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని, చాలా దేశాలు ఈ రంగాన్ని ప్రోత్సహిస్తూ ఆర్థికంగా అండగా నిలుస్తున్నాయని మేధావులు చెబుతున్నారు. కానీ మన దేశంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉన్నదని, ఎంతో పేరు ప్రఖ్యాతలు సాధించిన సంస్థ, ఎంతో మంది ప్రముఖ ఇంజినీర్లకు మార్గదర్శకంగా నిలిచిన సంస్థకు నిధులు నిలిపివేయడమంటే దాని నడ్డి విరచడమేనని విమర్శిస్తున్నారు. ఎన్నో కీలక పరిశోధనల్లో పాలుపంచుకున్న సంస్థను ఆర్థికభారం పేరుతో హత్య చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక్కో సంస్థను నిర్వీ ర్యం చేసుకుంటూ పోతే చివరికి దేశంలో ఏం మిగులుతుందని నిలదీశారు. ‘అయితే అమ్మకం లేకుంటే నిర్వీర్యం’ అనే విధానాన్ని ఇప్పటికైనా మార్చుకోవాలని సూచించారు.
ఉనికి కోసం వెతుకులాట
నిధులు నిలిపివేత నిర్ణయంపై కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తుండటం.. నిలిపివేత గురించి మే నెలలోనే మౌఖిక ఆదేశాలు ఇవ్వడంతో ఐఎన్ఏఈ అప్రమత్తమైంది. కేంద్రం అన్నంత పని చేస్తుందని అప్పుడే అంచనా వేసినా అకాడమీ ఉనికిని కాపాడుకోవడానికి, తన సొంత కాళ్ల మీద నిలబడటానికి నిధుల వేట ప్రారంభించింది. నిధులను సమీకరించడం, కార్పస్ఫండ్ను ఏర్పాటు చేసుకోవడ ం, ఇంజినీరింగ్ మేధావులతో సమాలోచనలు జరుపడం, భవిష్యత్తులోనూ సంస్థకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండటానికి చర్యలు తీసుకోవడంపై దృష్టిసారించింది.
చాలా బాధాకరం
ఇంజినీరింగ్ రంగంలో దేశంలోనే పేరు ప్రఖ్యాతలు గాంచిన అకాడమీతో తెగదెంపులు చేసుకోవాలని కేంద్రం నిర్ణయించడం చాలా బాధాకరం. ఈ నిర్ణయంతో ఇంజినీరింగ్ రంగంపైనేగాక దేశ పునాదులపైనా ప్రభావం పడుతుంది.
– అనిల్ కకోద్కర్, ఐఎన్ఏఈ మాజీ అధ్యక్షుడు, ఆటోమిక్ ఎనర్జీ విభాగం మాజీ చైర్మన్