న్యూఢిల్లీ, ఆగస్టు 2: ప్రజా సంక్షేమ పథకాలన్నింటినీ వదిలించుకొంటున్న కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం, మరో సబ్సిడీ పథకానికి మంగళం పాడేందుకు రంగం సిద్ధం చేస్తున్నది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఇచ్చే వంటగ్యాస్ రాయితీ సొమ్మును వారి బ్యాంకు ఖాతాల్లో వేసేందుకు 2013లో యూపీఏ ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యక్ష హాన్స్తాంత్రిక్ లాభ్ (పహల్) పథకాన్ని ఎత్తివేసేందుకు మోదీ సర్కారు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. కేంద్ర ఆర్థికశాఖ ఈ అంశంపై చర్చలు జరుపుతున్నదని, త్వరలోనే ఈ పథకాన్ని ఎత్తేస్తారని జాతీయ మీడియా పేర్కొన్నది. దీంతో పేదలకు ఇకనుంచి వంటగ్యాస్ సబ్సిడీని అధికారికంగా ఎత్తివేసినట్టేనని ఆర్థికవేత్తలు అంటున్నారు.
ఇప్పటికే నామమాత్రం
మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు వంటగ్యాస్ సబ్సిడీని క్రమంగా తగ్గిస్తూ వస్తున్నది. 2016కు ముందు దేశంలో దాదాపు 29 కోట్ల మంది వంట గ్యాస్ వినియోగదారులు ఉండేవారు. వీరికి సబ్సిడీ కోసం 2020-21 బడ్జెట్లో రూ.27,256.2 కోట్లు కేటాయించింది. వినియోగదారుల్లో కోటిన్నర మంది ధనికులకు మొదట సబ్సిడీ ఎత్తివేసింది. ఆ తర్వాత 2020లో మార్కెట్ ధరలు, సబ్సిడీ ధర సమానం కావటంతో సబ్సిడీ ఇవ్వటం ఆపేసింది. ఆ తర్వాత ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన (పీఎంయూవై) ఖాతాదారులకు తప్ప అందరికీ సబ్సిడీని ఉపసంహరించింది. దీంతో సబ్సిడీ వినియోగదారుల సంఖ్య 9 కోట్లకు పడిపోయింది. పీఎంయూవై కింద కూడా సబ్సిడీ రూ.200 మించి ఖాతాల్లో వేయటం లేదు. ఇప్పుడు పహల్ పథకాన్ని ఎత్తేస్తే అది కూడా రాదని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
ద్రవ్య లోటు పూడ్చేందుకే..
దేశ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకూ కుంగిపోతుండటంతో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో ద్రవ్య లోటు 2022-23 ఆర్థిక సంవత్సరంలో 6.4 శాతానికి చేరవచ్చని కేంద్రం అంచనా వేసింది. అంటే జీడీపీలో రూ.16.61 లక్షల కోట్ల ద్రవ్యలోటు అన్నమాట. మోదీ సర్కారు అసంబద్ధ చర్యలతో వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగాలన్నీ వృద్ధిలో వెనుకపట్టు పట్టాయని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. ద్రవ్య లోటు అంచనా దీనిని రుజువు చేస్తున్నది. ఈ నేపథ్యంలో లోటును పూడ్చుకొనేందుకు మోదీ సర్కారు పేదల కోసం అమలు చేస్తున్న ఒక్కో సంక్షేమ పథకాన్నీ ఎత్తేస్తున్నది. ఇప్పటికే వంటగ్యాస్ సబ్సిడీ సొమ్ము వినియోగదారుల ఖాతాల్లో వేయటం మానేసింది.
రూ.800 కోట్లు మిగులు
2022-23 ఆర్థిక సంవత్సరంలో వంటగ్యాస్ సబ్సిడీకి కేంద్రం రూ.5,812 కోట్లు కేటాయించింది. ఇందులో పహల్ పథకానికి రూ.800 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు ఆ పథకాన్ని ఎత్తేస్తే ఆ సొమ్ము మొత్తం కేంద్రానికి మిగులుతుంది. నిజానికి పహల్ పథకాన్ని మోదీ అధికారంలోకి రాగానే 2014లో మొదటిసారి సమీక్షించింది. 2015లో మరోసారి కేంద్రం సమీక్షించింది. తాజాగా పథకాన్ని పూర్తిగా ఎత్తేయాలని నిర్ణయించినట్టు తెలిసింది.