హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : కేంద్రంలోని మోదీ సర్కారు సహకార సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశాభివృద్ధిలో కేంద్రం.. రాష్ట్రాల భాగస్వామ్యంతో నడువాలన్న రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని రాజకీయ, ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల (సీఎస్ఎస్) విషయంలో మోదీ సర్కార్ వాటాను భారీగా తగ్గించుకుంటూ, ఆ భారాన్ని రాష్ట్రాల నెత్తిన పడేస్తున్నదని వివరిస్తున్నారు. గతంలో సీఎస్ఎస్లలో కేంద్రం మెజారిటీ వాటాను (75% నుంచి 100 శాతం వరకు) భరించేది. కానీ ప్రస్తుత పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉన్నది. దాదాపు అన్ని ప్రధాన పథకాల్లోనూ కేంద్రం తన వాటాను 60 శాతానికి పరిమితం చేసింది. దీనివల్ల రాష్ట్రాలు తమ పరిమితికి మించి నిధులను భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జీఎస్టీ తర్వాత రాష్ట్రాల సొంత రాబడి వనరులు పరిమితంగా ఉన్న తరుణంలో, కేంద్రం ఇలా బాధ్యతల నుంచి తప్పుకోవడం రాష్ట్రాలను అప్పుల ఊబిలోకి నెట్టడమేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పథకాల పేర్లు మార్చడంపై ఉన్న శ్రద్ధ, నిధుల కేటాయింపుపై కేంద్రానికి లేకపోవడం విచారకరమని విమర్శిస్తున్నారు. ‘సబ్ కా సాథ్ – సబ్ కా వికాస్’ తమ విధానం అని చెప్పే కేంద్ర ప్రభుత్వ పెద్దలు… రైతును ఆదుకోవాల్సిన ఫసల్ బీమా యోజన బాధ్యతను రాష్ట్రాలపై నెట్టేయడం దారుణమని మండిపడుతున్నారు.
గ్రామీణ పేదలకు కొండంత అండగా నిలిచిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) పరిస్థితి ఇప్పుడు దారుణంగా మారింది. గతంలో 100 శాతం నిధులను కేంద్రమే భరించేది. కానీ, ప్రస్తుత నిబంధనల ప్రకారం రాష్ట్రాలు 40 శాతం భరించాల్సిన పరిస్థితిని కల్పించింది. నిధుల విడుదల్లో జాప్యం చేస్తూ, పని దినాలను కుదిస్తూ.. రాష్ట్రాలపై ఆర్థిక భారం మోపుతూ పథకాన్ని నీరుగారుస్తున్నది. పథకం ఆమల్లో కొత్త సాంకేతిక నిబంధనలు తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల్లోని కార్మికుల పని దినాలను తగ్గిస్తున్నది. కేంద్రంలోని మోదీ సర్కార్ తాజా నిర్ణయంతో గ్రామీణ పేదలకు ఉపాధి పనులు తగ్గిపోయాయి.
రైతులకు పంట నష్టం జరిగినప్పుడు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రారంభించిన ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై) అమల్లో కేంద్రం తన వాటాను తగ్గించుకొని రాష్ట్రాలపై భారాన్ని మోపుతున్నది. రైతులను ఆదుకోవాల్సిన ఫసల్ బీమా యోజనలో కేంద్రం తన వాటాను ఏకంగా 50 శాతం నుంచి 25 శాతానికి తగ్గించుకున్నది. ఫలితంగా రాష్ట్రాలు 75 శాతం మేర భరించాల్సి వస్తున్నది. ఈ పథకంలో ఖరీఫ్ పంటలు 2 శాతం, రబీ పంటలకు 1.5 శాతం, వాణిజ్య/తోట పంటలకు 5 శాతం ప్రీమియాన్ని రైతు చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వాలే భరించాలి. గతంలో ఈ పథకానికి అయ్యే ప్రీమియం సబ్సిడీ ఖర్చును కేంద్రం, రాష్ట్రాలు సమానంగా 50:50 నిష్పత్తిలో పంచుకునేవి. కానీ కేంద్రం తీసుకొచ్చిన మార్పుల వల్ల రాష్ట్రాల వాటా 75 శాతానికి పెరిగింది. దీనివల్ల ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రాల బడ్జెట్లపై తీవ్ర ప్రభావం పడుతున్నది.
సొంత ఆదాయ వనరులు తగ్గుతున్న తరుణంలో బీమా ప్రీమియం కోసం వేల కోట్లు కేటాయించడం రాష్ట్రాలకు కష్టతరంగా మారింది. అధిక భారం కారణంగా ఏపీ, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు ఒక దశలో ఈ పథకం నుంచి తప్పుకొని, సొంతంగా రాష్ట్ర స్థాయి పంట బీమా పథకాలను ప్రకటించాయి. ప్రభుత్వం చెల్లించే భారీ ప్రీమియం నిధులు ప్రైవేట్ బీమా కంపెనీలకు చేరుతున్నాయి. కానీ, రైతులకు క్లెయిమ్లు సకాలంలో అందడం లేదనే విమర్శ కూడా ఉన్నది. ఉదాహరణకు, ఒక రాష్ట్రంలో పంట బీమా కోసం రూ.1,000 కోట్లు ఖర్చు అవుతుందనుకుంటే, గతంలో కేంద్రం రూ.500 కోట్లు ఇచ్చేది. ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం కేంద్రం తన వాటాను రూ.250-300 కోట్లకు పరిమితం చేసుకుంటే, మిగిలిన రూ.700-750 కోట్లు రాష్ట్రమే భరించాలి.
నిధుల వాటా తగ్గించిన కేంద్రం, పథకాల అమల్లో మాత్రం తన పెత్తనాన్ని వదులుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. పథకాల అమల్లో రాష్ర్ర్టాలకు అసంబద్ధమైన షరతులు, నిబంధనలు పెడుతూ రాష్ట్రాల స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రాలు తమ వాటా నిధులు ముందుగా జమ చేస్తేనే కేంద్రం తన వాటా ఇస్తామనే కఠిన నిబంధనలు విధించడం సరికాదని మండిపడుతున్నారు. పథకం వ్యయంలో 40-75 శాతం భరిస్తున్న రాష్ట్రాలకు కనీస గుర్తింపు ఉండటం లేదని చెప్తున్నారు. ప్రతి పథకంపైనా ప్రధాని ఫొటో ఉండాలనే నిబంధనలు రాష్ట్రాల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నాయని వివరిస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వాస్తవిక దృక్పథంతో ఆలోచించి, రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా నిధుల వాటాను పునఃసమీక్షించాల్సిన అవసరం ఉన్నదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
