ఐజ్వాల్: దిగుమంతి చేసుకునే పందులు, వాటి ఉత్పత్తులపై మిజోరం (Mizoram) ప్రభుత్వం నిషేధం విధించింది. బతికున్న పందులు, మాంసం, ఇతర ఉత్పత్తులును ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి వీళ్లేదని ఆదేశించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఇది అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. రాష్ట్రంలో మరోసారి ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ (ASF) కేసులు నమోదవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. పంతులను పెంచే చోట తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ సూచించింది. పరిసరాల్లో తరచూ క్రిమిసంహారక మందులను చల్లాలని తెలిపింది.
2020 ఆగస్టులో పందులు, వాటి ఉత్పత్తుల దిగుమతిపై ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే గత డిసెంబర్ నుంచి కొత్తగా ఏఎస్ఎఫ్ కేసులు నమోదు కాకపోవడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 1న దానిని ఎత్తివేసింది. ఈ వ్యాధితో గతేడాది 384 పందులు చనిపోయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ తరహా మరణాలు ఐదు జిల్లాల్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు.