బెంగళూరు : కర్ణాటక రవాణా శాఖ మంత్రి బైరాతి సురేశ్ శనివారం చేసిన తనిఖీల్లో క్షేత్ర స్థాయిలోని వాస్తవ పరిస్థితులు బోధ పడ్డాయి. ఓ బీఎంటీసీ బస్సులో మంత్రి వద్ద టికెట్కు సరిపడా చిల్లర లేకపోవడంతో కండక్టర్ ఆయనను దిగి పొమ్మని అడిగారు. ముఖానికి మాస్క్ తగిలించుకొని రెండు గంటల పాటు 10 బీఎంటీసీ బస్సుల్లో ప్రయాణించిన ఆయన, ప్రయాణికులు ఎదుర్కొనే ఇబ్బందులను స్వయంగా అనుభవించారు. ఫన్ వరల్డ్ బస్ స్టాప్ దగ్గర దిగడానికి బస్ ఆపాలని ఓ ప్రయాణికుడు కోరినా ఆపనందుకు డ్రైవర్, కండక్టర్ను మంత్రి సస్పెండ్ చేశారు.
మరో తనిఖీలో హెబ్బాళ్-నాగశెట్టిహళ్లి మార్గంలో వెళ్లే బస్సులో మంత్రి కావాలనే రూ.100 ఇచ్చి టికెట్ ఇవ్వాలని కండక్టర్ను కోరారు. చిల్లర లేదనే కారణంతో టికెట్ ఇవ్వకుండా ఆయనను బస్ దిగిపొమ్మని కండక్టర్ కోరారు. నాగశెట్టిహళ్లిలో దిగిన తర్వాత మీటర్ రూ.30 చార్జీ చూపించినా రూ.36 ఇవ్వాలని డిమాండ్ చేసిన ఓ ఆటో డ్రైవర్ వివాదంలోనూ మంత్రి జోక్యం చేసుకొన్నారు. వాస్తవాలను తనిఖీ చేసే ప్రక్రియగా దీన్ని అభివర్ణించిన మంత్రి, సిబ్బందిలో జవాబుదారీతనాన్ని, క్రమశిక్షణను పెంపొందించేందుకు బెంగళూరు అంతటా ఆశ్చర్యకరమైన తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు.