లక్నో: దేశంలో కలకలం రేపిన ఘటనల్లో లఖీంపూర్ ఖేరీ హింస ఘటన కూడా ఒకటి. నిరసనలు చేస్తున్న రైతులపైకి కేంద్ర సహాయమంత్రి అజయ్ మిశ్రా కుమారుడి వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు కూడా. ఈ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది.
ఇదిలా వుండగా, లక్నో వేదికగా ఏటా జరిగే ఐజీ, డీఐజీ స్థాయి సమావేశం ఇటీవల ప్రారంభమైంది. దీనిలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా కూడా లక్నో వచ్చారు. ఈ సమావేశంలో హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రాతో వేదిక పంచుకోవద్దని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ కూడా డిమాండ్ చేశారు. ఈ మేరకు మోదీకి ఒక లేఖ రాశారు.
అయినా సరే బీజేపీ అధిష్టానం ఇవేమీ పట్టించుకోలేదు. మూడు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంలో మోదీ, అమిత్ షాతోపాటు అజయ్ మిశ్రా కూడా వేదికపై కనిపించారు. కానీ సడెన్గా ఏమైందో ఈ కార్యక్రమం చివరి రోజున అజయ్ మిశ్రా ఎక్కడా కనిపించలేదు. ప్రధాని మోదీ ట్వీట్ చేసిన ఫొటోలు, ప్రభుత్వం విడుదల చేసిన ఫొటోల్లో కూడా అజయ్ మిశ్రా కనిపించడం లేదు.
దీంతో సడెన్గా మిశ్రా ఎందుకని సమావేశానికి దూరమయ్యారనే విషయం ఎవరికీ అర్థంకాలేదు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన కాంగ్రెస్.. ‘వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఓడిపోతానని తెలిసి మోదీ భయపడిపోయారా?’ అంటూ ట్వీట్ చేసింది. కాగా, లఖీంపూర్ ఘటనలో అజయ్ మిశ్రా కుమారుడు ఆకాష్ ప్రస్తుతం జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.